సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ): వీధి దీపాల నిర్వహణపై గ్రేటర్ జనం మండిపడుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా నిర్వహణ విషయంలో అధికారుల డొల్లతనం వెలుగు చూస్తున్నది. కార్పొరేటర్లతో పాటు పౌరులు వీధి లైట్లు వెలగడం లేదంటూ.. జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్‌కు భారీ సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం. నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈఈఎస్ఎల్ గడువు ముగిసి ఏడు నెలలు దాటినా కొత్త ఏజెన్సీని ఖరారు చేయలేదు.
అంతేకాదు ఏడేండ్ల పాటు ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్)కు వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ పేరిట చెల్లించిన నిధుల్లో దాదాపు రూ. 13 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నప్పటికీ సదరు ఏజెన్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు తిరిగి ఐదేండ్ల పాటు పోల్స్‌తో సహా రూ. 897 కోట్ల టెండర్ పిలిచేందుకు గత వారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
కొత్త ఏజెన్సీ నియమించే వరకు నిర్వహణ పట్ల ప్రజలతో పాటు కార్పొరేటర్ల నుంచి విమర్శలు వెలువెత్తడంతో ఈ నెలలోనే జోన్‌కు రూ. 4 కోట్ల చొప్పున రూ. 24 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రేటర్లో చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఈ క్రమంలోనే 5 లక్షలకు పైగా ఉన్న వీధి దీపాల్లో దాదాపు 35 శాతానికి పైగా వెలగడం లేదు. అంధకారంలో ఉన్న ప్రాంతాల్లో వాహన ప్రమాదాలు, దొంగల బెడద పట్ల జనాల్లో భయాందోళన నెలకొంది.
అధ్యయనం పేరిట కాలయాపన
ఇండివిజ్యువల్ లుమినర్ కంట్రోల్ (ఐఎల్సీ) లేదా ఇంటిగ్రేటెడ్ మినార్ మానిటరింగ్ (ఐఎంఎం) సిస్టం అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐఎల్సీ ద్వారా ఒక్కో స్ట్రీట్ లైట్‌ని నేరుగా మెయింటనెన్స్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఒకే చోట నుంచి ఎక్కడ స్ట్రీట్ లైట్ వెలగకపోయినా తెలుసుకోవచ్చు. ఆదే ఐఎంఎంతో అయితే ఒక ఏరియా లేదా కొన్ని లైట్లను కలిపి మెయింటెయిన్ చేయవచ్చు. ఈ రెండింట్లో ఏదో ఒక సిస్టం అమల్లోకి తీసుకురానున్నారు. కొత్తగా వచ్చే ఏజెన్సీలకు ఐదేండ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. పనితీరు బాగుంటే మరో రెండేండ్లు పొడగిస్తారు.
పండుగ వస్తే చాలు…
ఏదైన పండుగ వచ్చిందంటే కొందరికి ఎక్కడ లేని ఆనందం.. ఎమర్జెన్సీ ముసుగులో పారదర్శకత నీళ్లొదిలి అక్రమాలకు తెరలేపడం పరిపాటిగా మారుతోంది. గతేడాది వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాత్కాలిక లైట్ల పేరిట రూ. కోట్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదికలో తేల్చారు. తాత్కాలిక లైట్ల బిల్లుల చెల్లింపుల సందర్భంగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గత కమిషనర్ ఇలంబర్తి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అక్రమాలు జరిగినట్లు తేల్చారు. అయితే చర్యల విషయంలో తాత్సారం చేయడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రూ. 2.7 కోట్లు కేటాయించారు. వీటిలో ఎక్కువ లైట్లు ఏర్పాటు చేసే జోన్ల కంటే తక్కువ లైట్లు ఏర్పాటు చేసే జోన్లకు ఎక్కువ కేటాయింపులు జరపడం గమనార్హం.