Power Cuts | సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): 24 గంటల విద్యుత్ సరఫరా.. కరెంట్ కోతలకు ఆస్కారమే లేదు.. ఇది రేవంత్ సర్కార్ వేదికలపై చెప్పే కోతల మాట.. కోతలే లేవు.. ఎంత డిమాండ్ వచ్చినా సప్లైలో అంతరాయముండదు.. ఇది దక్షిణ డిస్కం ఉన్నతాధికారుల నమ్మకమైన మాట.. కానీ క్షేత్రస్థాయిలో ఇవన్నీ అబద్ధాలని తేలింది. సోషల్ మీడియా వేదికగా కరెంట్ కోతలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కరోజులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సిబ్బంది సతమతమవుతున్నారు. లోడ్ పెరిగితే సప్లైలో కొంత సమస్యలుంటాయని విద్యుత్ రంగనిపుణులు మొదటినుంచి హెచ్చరిస్తున్నా.. సర్కార్ మాత్రం వారి మాటలను పెడచెవిన పెట్టి అత్యుత్సాహంతో, అధికార దర్పంతో తమదైన ధోరణిలో ప్రజలను తమ 24 గంటల మాటలతో మభ్యపెట్టి మాయచేయాలని చూసింది.
కానీ ఆ మాయలు పటాపంచలయ్యాయి. ఒక్కరోజులో కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక జనం ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ కరెంట్ కోతలేంటంటూ మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో లేని పవర్‌కట్స్ ఇప్పుడు ఎలా వస్తున్నాయంటూ విద్యుత్ అధికారులను నిలదీస్తున్నారు. దీంతో కరెంట్ కోతలే లేవని చెప్పిన సర్కార్ కోతల మాటలను ఇప్పుడు నమ్మే పరిస్థితి పోయింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి.. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ కరెంట్ తీసేస్తున్నారు. దీనిపై ఒక్క సోమవారమే ఎక్స్ వేదికగా నెటిజన్ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మూడురోజులుగా ఈ కోతలపై నెటిజన్లు స్పందిస్తూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నప్పటికీ సోమవారం ఈ తీవ్రత మరింత పెరిగింది.
ఒక్కరోజులో వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు..
ఎక్స్ వేదికగా పలువురు నెటిజన్లు వివిధ ప్రాంతాల్లో కరెంట్ పోయిందంటూ అనేకచోట్ల నుంచి ఫిర్యాదులు చేశారు. టోలీచౌకిలో పోడియం మాల్ బ్యాక్ సైడ్ ప్రతీరోజు ఉదయం కరెంట్ పోతున్నదని ముబషీర్అలీ, షేక్‌పేట్ ఏరియాలోని హమ్రా కాలనీలో ఉదయం నుంచి కరెంట్ లేదంటూ మహీంద్ర ఫిర్యాదులు చేశారు. మీరాలం ప్రాంతంలో రెండు గంటలుగా కరెంట్ లేదని, తాను ఫిర్యాదు చేద్దామని ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులో లేరంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఉదయం, సాయంత్రం వేళల్లో కరెంట్ పోవడం ఒక ఎత్తు అయితే.. తెల్లవారుఝామున, అర్ధరాత్రి సమయాల్లో కరెంట్ పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు ఈ పోస్టుల ద్వారా తెలుస్తోంది.
అయితే ఎక్కడా కరెంట్ కోతలు లేవని, ఎక్కడైనా కోతలు ఉంటే వెంటనే తమ నోటీసుకు వస్తాయంటూ ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా.. ఆ పరిస్థితి మాత్రం క్షేత్రస్థాయిలో లేదని ఈ పోస్టుల ద్వారా అర్ధమవుతున్నది. మరోవైపు కొందరు వినియోగదారులు తాము ఫిర్యాదు చేయగానే వ్యక్తిగత సమాచారం అడగడంతో విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతం చెప్పినా తమను వ్యక్తిగత సమాచారం ఎందుకు అడుగుతున్నారంటూ మండిపడ్డారు. ఇంకా వేసవి కాలం మొదలే కాలేదు.. ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితేంటంటూ సీఎంకు, టీజీఎస్పీసీడీసీఎల్కు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు.
సాంకేతికతతో లోపాలు గుర్తించి.. పరిష్కారం
-టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి
విద్యుత్ సరఫరాలో లోపాలను త్వరగా గుర్తించి సకాలంలో పరిష్కరించే ఉద్దేశంతో టీజీఎస్పీడీసీఎల్ తన పరిధిలోని 11 కేవీ ఫీడర్లలో ఫీడర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాంకేతికతను అమలు చేస్తున్నామని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా ఫీడర్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని ఆటోమేటిక్‌గా గుర్తించవచ్చని, లోపం ఎక్కుడుందో సులభంగా గుర్తించడానికి వీలుగా జీఐఎస్ డేటాను సంబంధిత అసిస్టెంట్ ఇంజినీర్‌కు సాసా యాప్‌కు బజర్ సౌండ్ ద్వారా అప్రమత్తం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని 11 కేవీ ఫీడర్లు 8621లలో ఈ సాంకేతికతను పొందుపరుస్తున్నామని, ప్రస్తుతానికి 4433 ఫీడర్ల పరిధిలో పొందుపరిచినట్లు తెలిపారు.
మిగిలిన ఫీడర్లకు మార్చి నెలాఖరునాటికి ఈ సాంకేతికతను పొందుపరుస్తామని ఫరూఖి తెలిపారు. అన్ని సర్కిళ్ల, జోన్ల ఎస్ఈలు, సీఈలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎండీ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి సీజన్ పీక్ స్టేజ్‌లో ఉన్నదని, డిమాండ్ 17వేల మెగావాట్లకు చేరువలో ఉన్నదన్నారు. ఈ సీజన్లో 10వేల మెగావాట్లకు మించి గరిష్ఠ డిమాండ్ రికార్డ్ అవుతోంది. ఈనెల 4న 10533 మెగావాట్ల రికార్డు స్థాయి పీక్ డిమాండ్, 5న 215.52 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది.