హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో దాదాపు గంటపాటు భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. వర్షం కారణంగా హైదరాబాద్‌లోని వెస్ట్‌జోన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో వాహనదారులు గంట పాటు వాయిదా వేసుకోవాలని పోలీసులు అభ్యర్థించారు.
లేదంటే ప్రజలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లోని వెస్ట్‌జోన్ ప్రాంతాలైన పంజాగుట్ట, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. సికింద్రాబాద్, లక్డీకాపుల్, ఖైతరాబాద్‌లో ఇబ్బంది అవుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులందరూ తమ ప్రయాణాన్ని మరో గంట పాటు వాయిదా వేయాలని కోరారు.
ఇదిలా ఉండగా.. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు పలుచోట్ల మ్యాన్ హోళ్లను తెరువగా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో వైపు వర్షం కారణంగా హయత్‌నగర్ – విజయవాడ హైవే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షం ప్రభావంతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి.