సిటీబ్యూరో, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ)/వెంగళరావునగర్/జూబ్లీహిల్స్/ ఎర్రగడ్డ: ‘ గోపన్న మా కుటుంబం వీధిన పడకుంట ఆపిండు. తిండి లేక ఇబ్బంది పడుతుంటే నాకు, నా భర్త దస్తగిరికి జీటీఎస్ దేవాలయంలో ఉద్యోగం పెట్టిచ్చిండు. మాలాంటి వేలాది మంది పేదోళ్లకు అండగ ఉన్నడు. ఎవరికీ ఏ కష్టం వచ్చనా వెంటనే వచ్చి ఆదుకున్నడు. పండగలకు సొంత అన్నలా కొత్త బట్టలు పెట్టిండు. జూబ్లీహిల్స్ ఆడబిడ్డలకు సారె చీరలు పెట్టిండు. అలాంటి గోపన్న అకాలంగా దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నం. గోపన్న ఎప్పుడూ మాబాగోగుల గురించే తపన పడ్డడు.
మేమంతా ఎప్పటికీ గోపన్నతోటే నిలబడ్డం. ఇప్పుడు కూడా గోపన్న కుటుంబంతోనే ఉంటం’. అంటూ మాగంటి సునీతతో వెంగళరావు నగర్ డివిజన్ యాదగిరినగర్‌కు చెందిన గీత భావోద్వేగానికి గురయ్యారు. తమ బతుకును రోడ్డు పాలు కాకుండా కాపాడి పునర్జన్మనిచ్చిన గోపన్న కుటుంబతోనే ఉంటామంటూ ప్రజలను కలిసేందుకు శనివారం వెళ్లిన మాగంటి సునీతతో కలిసి నడిచారు. ప్రజల బంధువు గోపన్న కుటుంబానికి బాసటగా నిలుస్తామని కదులుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు వెళ్తున్న మాగంటి సునీతకు అడుగడుగునా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. మాగంటి గోపీనాథ్ సేవలు పొందిన వారంతా ఆమెతో కలిసి వస్తూ మేమున్నామంటూ ఆత్మీయ భరోసా కల్పిస్తున్నారు. సునీత రాకతో బస్తీవాసులు వందలాదిగా కలిసి నడుస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ప్రజలను కలిసేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే బోరబండ, రహ్మత్ నగర్, యూసుఫ్‌గూడ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ డివిజన్లలో ఆమె పర్యటించారు. కాలనీలు, బస్తీల్లో ఇంటింటికీ వెళ్లి వారి కష్టసుఖాలను పంచుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఆమెకు మహిళలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. సొంత ఆడబిడ్డలా ఆత్మీయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు.
మాగంటి గోపీనాథ్ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టని అభివృద్ధి పథకాలను ఆమెకు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పనిచేసినన్ని రోజులు నిత్యం ప్రజల్లోనే ఉంటూ సమస్యలు తెలుసుకుని పార్టీలకు అతీతంగా పరిష్కరించేవారని చెబుతున్నారు. పదేండ్లలో తాము పొందిన అభివృద్ధి ఫలాలను ఆమెతో పంచుకుంటున్నారు. మహిళలు, యువతులు, వృద్ధులు గోపీనాథ్ సేవలను స్మరించుకుంటూ పందేండ్లు సుఖసంతోషాలతో ఉన్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలంతా సునీత కుటుంబానికి అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. సునీతతో పాటు గోపీనాథ్ కూతుళ్లు కూడా ఆమెతో పర్యటిస్తున్నారు. బస్తీలు, కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల స్థాయి సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా నిర్వహిస్తున్నారు. సమావేశాలకు డివిజన్ల వారీగా బీఆర్ఎస్ క్యాడర్‌తో పాటు కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరవుతున్నారు. కిందిస్థాయి నేతలు ఒక్కతాటిపై నిలబడి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మళ్లీ బీఆర్ఎస్ జెండానే ఎగురవేస్తామని కేటీఆర్‌కు హామీ ఇస్తున్నారు. మరోవైపు పార్టీ చేపడుతున్న బూత్ స్థాయి సమావేశాలకు కూడా స్థానిక ప్రజలు భారీ ఎత్తున హాజరవుతున్నారు. అందరం ఏకమై సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని భరోసా కల్పిస్తున్నారు.
రాజకీయ పార్టీలన్నీ చేపడుతున్న అంతర్గత సర్వేల్లోనూ ప్రజలంతా మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. సర్వే ఏదైనా బీఆర్ఎస్ పార్టీనే అగ్రస్థానంలో నిలుస్తున్నది. ప్రజల అభిప్రాయాలన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగానే వస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా.. బీఆర్ఎస్ గెలుపు ఖామనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఫలాలు కండ్ల ముందే కనిపిస్తుండటంతో ఏకపక్షంగా బీఆర్ఎస్కే పట్టం కట్టడం ఖాయమనే మాటలే వినిపిస్తున్నాయి.