మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఉన్నతాధికారులు, లబ్ధిదారులతో సమావేశం
బేగంపేట్ మే 24: పేదలు ఆత్మగౌరవంతో సొంత ఇంటిలో సంతోషంగా జీవించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో కలెక్టర్ శర్మన్‌తో కలిసి రెవెన్యూ, హౌసింగ్ అధికారులు, బన్సీలాల్‌పేట్ డివిజన్ బండ మైసమ్మ నగర్‌కు చెందిన పలువురు లబ్ధిదారులతో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా లబ్ధిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్టు వివరించారు.
ఈ ఇండ్లను స్థానికంగా నివసిస్తున్న అర్హులైన వారిని లబ్ధిదారుల సమక్షంలోనే గుర్తించి కేటాయించామని పేర్కొన్నారు. నిజమైన అర్హులు అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇస్తున్నామని, ఎవ్వరు ఆందోళన చెందొద్దని మంత్రి సూచించారు. ఇరుకైన ఇండ్లలో సరైన సౌకర్యాలు, వసతులు లేక అనేక అవస్థలు పడుతున్న పేదల కోసం విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ తదితర సౌకర్యాలతో కూడిన ఇండ్లను నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో పై అంతస్తులలో నివసించే వారి సౌకర్యార్థం లిఫ్ట్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతే కాకుండా డబుల్ బెడ్రూం కాలనీల నిర్వహణ, లిఫ్ట్‌ల విద్యుత్ బిల్లుల భారం ఎవరిపైనా పడకుండా షాపులను నిర్మించామని పేర్కొన్నారు. ఈ షాపుల ద్వారా వచ్చే అద్దెలను కాలనీల నిర్వహణ లిఫ్ట్ విద్యుత్ బిల్లుల తదితర అవసరాల కోసం వినియోగించుకోవాలని చెప్పారు. ఇవే కాకుండా ప్రభుత్వం ఉచితంగా తాగునీరు కూడా సరఫరా చేస్తున్నదని చెప్పారు. సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి, తహసీల్దార్ బాలశంకర్, హౌసింగ్ ఈఈ వెంకట్ దాస్‌రెడ్డి, డీఈ గంగాధర్ పాల్గొన్నారు.