పీర్జాదిగూడ, సెస్టెంబర్ 16: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ సర్వే నంబర్ 199 వీకర్ సెక్షన్ కాలనీలో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన ఇంటి కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుల కథనం ప్రకారం..వీకర్ సెక్షన్లో మహ్మద్ గౌస్, ఐశ్రత్బేగం 25 సంవత్సరాల క్రితం రేకుల ఇంటిని నిర్మించుకుని నివాసముంటున్నారు. ఇంటిని మరమ్మతులు చేసుకుంటుండగా కాగ్రెస్ నాయకులు పరమేశ్, కరీం ఇద్దరు వచ్చి రూ. 3లక్షల డిమాండ్ చేశారు.
డబ్బులు ఇవ్వకపోవడంతో తమపై కుట్రపూరితంగా తప్పుడు సమాచారం రెవెన్యూ అధికారులకు అందించారని ఆరోపించారు. ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ సిబ్బంది జేసీబీని తీసుకురావడంతో ఆవేదనకు గురైన మహ్మద్ గౌస్ కుమారుడు షానావాజ్ తన పై పెట్రోల్ పోసుకుని చస్తానని హెచ్చరించాడు. కాలనీవాసులు నచ్చజెప్పడంతో విరమించుకున్నాడు. వెంటనే రెవెన్యూ సిబ్బంది వెనుతిరిగి వెళ్లారు. సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.