జవహర్నగర్, ఏప్రిల్ 25: జవహర్నగర్ కార్పొరేషన్లో శుక్రవారం రెవెన్యూ సిబ్బంది పలు కాలనీల్లో అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది. పేదల ఇండ్లపైకి బుల్డొజర్ తీసుకురావడంపై జవహర్నగర్ ప్రజలు ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. చాకలి ఐలమ్మ కాలనీవాసులు అధికారులపై తిరగబడ్డారు. 30 ఏండ్ల నాటి కాలనీలోకి రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలంటూ రావడం విడ్డురంగా ఉన్నదని కట్టడాలను కూల్చవద్దంటూ అడ్డుకున్నారు.
ప్రభుత్వానికి ఇంటి పన్ను, కరెంటు, నల్లా బిల్లులు ఏండ్ల నుంచి చెల్లిస్తున్నాం… చాకలి వృతి చేసుకుని బతికేటోళ్లం.. మా కాలనీలోకి వచ్చి ఇండ్లను కూల్చివేస్తామంటే ఊరుకోమన్నారు. అయినా కనికరం చూపకుండా రెవెన్యూ సిబ్బంది పోలీసు పహారా మధ్య ఇండ్లను కూల్చివేశారు. కాగా, ‘మాకు ఈ చిన్నపాటి రేకుల ఇల్లే జీవనాధారం… కూలి పని చేసుకుని కాలం వెళ్లదీస్తున్నాం. మా ఇంటిని కూల్చొదం’టూ ఓ కుటుంబం ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకొనికిరోసిన్ పోసుకొని..చస్తామంటూ.. హెచ్చరించింది. రెవెన్యూ అధికారులు బయటకి వెళ్లాలని హుకుం జారీ చేశారు. పోలీసులతో ఇంటి తలుపులు బద్దలు కొట్టాలని ప్రయత్నించారు. ‘మేమే ఇంట్లోనే చస్తామం’టూ.. ఆ కుటుంబం భిష్మించుకుని ఇంట్లోనే ఉంటూ.. దండాలు పెట్టకుంటూ కూల్చొదంటూ బోరున విలపించారు.
25 ఏండ్ల నాటి 40 గజాల రేకుల ఇంటిలో జీవనం సాగిస్తున్నాం. పనికి వెళ్తేనే పూటగడిచే దుస్థితిలో కాలం వెళ్లదీస్తున్నాం. వర్షానికి రేకుల పగిలిపోతే… కొత్తగా నిర్మించుకుందామని నిర్మాణం చేపడితే రెవెన్యూ అధికారులు అక్రమమంటూ కూల్చివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను ఉసిగొల్పుతూ పేదలకు నిల్వ నీడ లేకుండా చేయడం దుర్మార్గం.
– నిడిగొండ రమాదేవి, చాకలి ఐలమ్మ కాలనీ జవహర్నగర్