శంషాబాద్ రూరల్, జూలై 28 : భారీ వర్షాలు కురుస్తుండడంతో శంషాబాద్ మున్సిపాలిటీలోని చెరువులు అలుగు పారుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నుంచి భారీగా వర్షంపు నీరు గొల్లపల్లి చెరువు మీదుగా తొండుపల్లి చెరువులోకి అక్కడి నుంచి శంషాబాద్ పట్టణంలోని కాముని చెరువు అక్కడి నుంచి రాళ్లగూడ చెరువు అక్కడి నుంచి శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం మీదుగా హిమాయత్‌సాగర్ చెరువులోకి వారం రోజులుగా వరద కొనసాగుతుంది. దీంతో పాటు శంషాబాద్ మున్సిపాలిటీలోని పాత శంషాబాద్ , ఆర్బీనగర్, మధురానగర్, ఆదర్శనగర్, సిద్ధేశ్వర కాలనీలలోని వర్షపునీరు సైతం చెరువులోకి చేరుతుంది. శంషాబాద్ మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో వర్షంతో ఇబ్బందులు పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంషాబాద్ మున్సిపాల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్‌యాదవ్, కమిషనర్ భోగేశ్వర్లు ,ఆయా వార్డు కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలో వర్షాల నేపథ్యంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. పురాతన ఇండ్లలో ఉన్న వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
వికారాబాద్ పట్టణంలోని అనంతగిరి వద్ద ప్రారంభమయ్యే ఈసీ వాగు వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. పూడూరు మండలం, షాబాద్ మండలంలోని రేగడిదోసాడ, తాళ్లపల్లి,నగర్గూడ, చందన్‌వెళ్లి చిన్నసోలిపేట్ గ్రామాల మీదుగా శంషాబాద్ మండలంలోని కవేలిగూడ, మల్కారం, కేబిదొడ్డి,సుల్తాన్‌పల్లి, కవ్వగూడ గ్రామాల మధ్యగా ఈసీవాగు వరద నీరు పెద్ద ఎత్తున హిమాయత్‌సాగర్ చెరువులోకి వచ్చిచేరుతుంది. మత్స్యకారులు ఎవరు వాగులోకి వెళ్లకుండా ఉండాలని ఇప్పటికే పోలీస్, రెవెన్యూ,పంచాయతీ రాజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు షాద్‌నగర్ నియోజకవర్గంలోని షాద్‌నగర్ పట్టణంతో పాటు కొందుర్గు, నందిగామ మండలంలోని నర్సప్పగూడ గ్రామ పెద్దచెరువులోకి వర్షపునీరు చేరి అక్కడి నుంచి కొత్తూరు మండలంలోని మల్లాపూర్, మక్తగూడ వరకు వర్షపునీరు వచ్చి శంషాబాద్ మండలంలోని పాలమాకుల మైసమ్మ చెరువు నీరు మండలంలోని పిల్లోనిగూడ, మక్తగూడ గ్రామాల వద్ద కలిసి అక్కడి నుంచి శంషాబాద్ మండలంలోని నానాజీపూర్, రాయన్నగూడ , కాచారం,కేబిదొడ్డి గ్రామాల మధ్యగా వచ్చి సుల్తాన్‌పల్లి గ్రామ సమీపంలో ఈసీ వాగులోకి వర్షపునీరు చేరుతుంది, అక్కడి నుంచి హిమాయత్‌సాగర్ చెరువులోకి వరద భారీగా చెరుతుంది.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శంషాబాద్ మండలంలోని సుల్తాన్‌పల్లి- కేబిదొడ్డి గ్రామాల మధ్య ఎంటేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో శంషాబాద్ – మొయినాబాద్ మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు మండలాల ప్రజలు రాకపోకలు నిర్వహించడం కోసం మరో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడి నుంచి ప్రయాణం కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు కేబిదొడ్డి-సుల్తాన్‌పల్లి గ్రామాల మధ్య ఎంటేరువాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం చేస్తే రెండు మండలాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు ఉండవని స్థానికులు కోరుతున్నారు.