ఖైరతాబాద్, అక్టోబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టుకు ముందు కాలుష్య నియంత్రణ మండలిని ప్రక్షాళన చేయాలని ఎన్విరాన్మెంట్ సోషల్ వర్కర్ సంస్థ అధ్యక్షులు పీఎల్ఎన్ రావు అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాది రాజేశ్ కుమార్, ఆరెగూడెం మాజీ సర్పంచ్ మల్లేశ్ యాదవ్, నల్గొండ జిల్లా పెద్ద దేవులపల్లి గ్రామానికి చెందిన రైతు ఠాకూర్ రాజారాం సింగ్, కాలుష్య వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు లింగారెడ్డితో కలిసి మాట్లాడారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు అది కాలుష్యంగా ఎందుకు మారిందన్న దానిపై విచారణ జరిపించాలన్నారు.
పటాన్ చెరువు పారిశ్రామికవాడతో పాటు జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయకుండా నేరుగా నాలాల ద్వారా మూసీలోకి వదులుతున్నారని, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలు గత 20 ఏండ్లుగా భూగర్భ జలాలు కలుషితమై, పంటలు పండక తీవ్రంగా నష్టపోతున్నారని, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి చోద్యం చూసినందు వల్లే మూసీ మొత్తం కాలుష్య కుహరంగా మారిందన్నారు. పటాన్ చెరువు, బీహెచ్ఈఎల్, మల్లాపూర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో వివిధ పరిశ్రమల నుంచి వెలువుడే వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయకపోవడం, వాటిపై పీసీబీ పర్యవేక్షణ కొరవడి మూసీ కలుషితమైందన్నారు. వ్యర్థాల నియంత్రణ, నివారణలో ఆ శాఖ పూర్తిగా విఫలమైందని, అవినీతి అక్రమాలతో ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన పీసీబీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.