హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Poll) కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద వేచిఉన్నారు. అయితే పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. బోరబండ, షేక్‌పేట సహా 11 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది, ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ నిలిచిపోవడంతో ఓటర్లు బారులుతీరారు.
బోరబండలోని పోలింగ్ బూత్ నంబర్ 348లోని ఈవీఎంలో సాకేంతిక సమస్య తలెత్తింది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. క్యూలైన్లలో ఓటర్లు వేచిఉన్నారు. అదేవిధంగా రహమత్‌నగర్‌లోని 165, 166 బూత్‌లలో ఈవీఎంలు మోరాయించాయి. వెంగళరావు నగర్ డివిజన్ 76, 78 బూత్‌లలో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో వేచిఉన్నారు.
షేక్‌పేటలో బూత్ నంబర్ 30 లోని ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే దానిని అధికారులు పరిష్కరించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఎర్రగడ్డ, బోరబండలో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. యూసుఫ్‌గూడ గవర్నమెంట్ స్కూల్లో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఒకే దగ్గర 10 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ఎర్రగడ్డలోని పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. పోలింగ్ ఏజెంట్లు గుర్తింపు కార్డులు ధరించకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. షేక్‌పేటలో కూడా పోలింగ్ ప్రారంభమైందని చెప్పారు. 6 పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించామన్నారు. గతంలో కంటే 40 పోలింగ్ కేంద్రాలను పెంచామని వెల్లడించారు.