సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రానికి ఉద్రిక్తతల నడుమ ముగిసింది. అధికార పార్టీ అడుగడుగునా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఎర్రగడ్డ, షేక్‌పేట, యూసుఫ్‌గూడ డివిజన్లలో పలు చోట్ల ఎంఐఎం,కాంగ్రెస్ నేతల అరాచకాలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకున్నాయి. షేక్‌పేట డివిజన్లోని అజీజ్ బాగ్, పారామౌంట్ కాలనీలోని పోలింగ్ స్టేషన్ల వద్ద కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్ హల్ చల్ చేశారు.
కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపించింది పోలింగ్ సరళి విషయానికొస్తే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ తొలి రెండు గంటల్లో చాలా కేంద్రాల్లో ఓటర్లు పెద్దగా కనిపించలేదు. మందకొడిగా సాగిన ఓటింగ్ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోలింగ్ పుంజుకున్నది. ముఖ్యంగా ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు పెంచినా ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం పెరగలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47.49శాతం ఉంటే స్వల్పంగా 48.47 శాతం నమోదు చేసుకోవడం గమనార్హం. జూబ్లీహిల్స్ ఓటరులో ఎలాంటి మార్పు లేదన్నట్లుగా మొత్తంగా పోలింగ్ శాతం 50 శాతం మించకపోవడం గమనార్హం. .
50 శాతం మించని పోలింగ్..
గ్రేటర్లో ఏ ఎన్నిక జరిగిన ఓటింగ్ శాతం 50 శాతం మించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలు, తాజా ఉప ఎన్నికలో కూడా 50 శాతం లోపు మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. మొత్తంగా 4 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే వీరిలో 46 శాతం 18 నుంచి 39 సంవత్సరాల లోపు వారే..ఇందులో 18 నుంచి 29 వయస్సు ఉన్న వారు 21 శాతం ఉంటే 30 నుంచి 39 వరకు వయస్సు ఉన్న వారు 25 శాతం. ఈ 46 శాతం నుంచి ఈ సారి భారీగానే ఓటింగ్ నమోదు అయిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ..
పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ పర్యవేక్షణ, పీఆర్వో యాప్ ఇన్, ఈసీఐ నెట్ కంట్రోల్ కేంద్రాన్ని సాధారణ పరిశీలకులు రంజిత్‌కుమార్ సింగ్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. కంట్రోల్ రూం పనితీరును జిల్లా ఎన్నికల అధికారి సాధారణ పరిశీలకులకు వివరించారు..
పోలింగ్ ప్రక్రియలో కీలక అంశాలు..
ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం
సమయం : పోలింగ్ శాతం
ఉదయం 9 గంటలకు : 10.02
11 గంటలకు : 20.76
మధ్యాహ్నం ఒంటి గంటకు : 31.94
మూడు గంటలకు : 40.20
ఐదు గంటలకు : 47.16
ఆరు గంటలకు : 48.47