సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఇటీవల సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా లేక ప్రజలను అపోహలకు గురిచేసే విధంగా కామెంట్లు చేసినా కఠిన చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు. అల్లు అర్జున్ రాకముందే థియేటర్లో తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలను పోస్టు చేయడం తాము గుర్తించామని, జరిగిన ఘటనపై వాస్తవాలకు సంబంధించిన వీడియోలను ఇప్పటికే పోలీసు శాఖ ప్రజల ముందు ఉంచినప్పటికీ కొందరు పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదని, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.