ఖైరతాబాద్, డిసెంబర్ 27: పేగు తెంచుకొని పుట్టిన ఓ శిశువును కర్కషులు రైల్వే ట్రాక్ వద్ద పడేసి వెళ్లారు. రైళ్లు వెళ్తున్నప్పుడు ఆ భీకరమైన శబ్దాన్ని తట్టుకుంటూ ఎన్ని గంటలు గడిపాడో తెలియదు. మూత్ర విసర్జన కోసం వెళ్లి ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు చేరదీశారు. ఈ ఘటన ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…. ఖైరతాబాద్ మారూతినగర్కు చెందిన పోతుల కనకరాజు శుక్రవారం సాయంత్రం అయ్యప్ప పూజ కోసం స్థానికంగా భూ లక్ష్మమ్మ ఆలయాన్ని వచ్చాడు.
మూత్ర విసర్జన చేసేందుకు వెనుక ఉన్న ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ చివరన ఉన్న ట్రాక్ వైపునకు వెళ్లాడు. అక్కడే ఏడుస్తూ మగ శిశువును కనిపించడంతో స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వెంటనే నిలోఫర్ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శిశువిహార్‌కు పంపించారు. గుర్తుతెలియని వ్యక్తులెవరో ట్రాక్ పక్కన శిశువును పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.