నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పలు ఫామ్‌హౌస్‌లు అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి అయ్యిందంటే చాలు కొన్ని ఫామ్‌హౌస్‌లలో వ్యభిచారం, పేకాట, రేవ్‌పార్టీలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు యథేచ్చగా సాగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న చీకటి దందాను కొందరు పోలీసులు క్యాష్ చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. దాడుల పేరుతో అటు యువతులను సరఫరా చేసే ఏజెంట్ల నుంచి, ఇటు పట్టుబడిన విటుల నుంచి లక్షల్లో దోచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడిగినంత ఇస్తే విషయం బయటకు పొక్కదు, మీడియాకు చేరదు, కేసులు నమోదు కావు. రికార్డుల కోసం ఒకవేల నమోదు చేసినా నామమాత్రపు సెక్షన్లతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): నగర శివారుల్లోని ఫాంహౌస్‌లలో జరుగుతున్న చీకటిదందా పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇతర రాష్ర్టాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో ఫాంహౌస్‌లలో జల్సా చేయడంతో పాటు బ్రోకర్ల సాయంతో యువతులతో ఎంజాయ్ చేస్తున్నారు. నెలన్నర క్రితం మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో కర్ణాటక ప్రాంతానికి చెందిన పది మంది యువకులు ఒక పార్టీ నిర్వహించారు.
ఈ పార్టీకి మైలార్దేవ్ల్లి ప్రాంతానికి చెందిన అంజుమ్ అనే బ్రోకర్ నలుగురు యువతులను సంబంధిత ఫామ్‌హౌస్‌కు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. అజ్ఞాత వ్యక్తులనుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆరోజు రాత్రి ఫామ్‌హౌస్‌పై దాడులు జరిపి యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి వద్ద నుంచి రూ.లక్షన్నర తీసుకుని వదిలేసినట్లు విశ్వసనీయ సమాచారం.
మొయినాబాద్ మండలంలోని మరో ఫామ్‌హౌస్‌లో మహారాష్ట్రకు చెందిన 8 మంది నెల రోజుల క్రితం జల్సా చేసుకున్నారు. వారికి సాలేహ అనే మహిళా బ్రోకర్ ఐదుమంది యువతులను సరఫరా చేసినట్లు సమాచారం. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు జరిపి యువతులతో పాటు విటులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5లక్షల వరకు వసూలూ చేసి వదిలేసినట్లు విశ్వసనీయ సమాచారం. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న మెజార్టీ ఫామ్‌హౌస్‌లలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని తెలుస్తోంది. ఇక వీకెండ్లలో అక్కడి భాగోతాలు చెప్పనవసరం లేదు.
ఒకప్పుడు ఎక్కువగా ఏపీ, తెలంగాణ వారు ఎక్కువగా జల్సా చేసే ఈ ఫామ్‌హౌస్‌లలో ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చి వాలిపోతున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ర్టాల నుంచి 3-4 గంటల్లో నగర శివారు ప్రాంతాలకు చేరుకునే సౌలభ్యం ఉండటంతో చాలామంది యువకులు, వ్యాపారులు కార్లలో వచ్చి నగర శివారులోని హోటళ్లు, ఫాంహౌస్‌లలో బస చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బ్రోకర్లను సంప్రదించడంతో వారు యువతులను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ర్టాలవారితో పాటు తెలంగాణకు చెందిన చోటామోటా నేతలు సైతం ఫాంహౌస్‌లలో జల్సాలు చేస్తున్నట్లు సమాచారం.
యువతులను సరఫరా చేసే కొందరు ఏజెంట్లు అటు పోలీసు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తూనే ఇటు తమ దందాను సాగిస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా పశ్చిమ బెంగాల్, ముంబాయి, కర్నాటక, ఏపీ తదితర రాష్ర్టాల నుంచి యువతులను తీసుకువచ్చి నగరంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిలో చాలామంది బ్రోకర్లు కొంతమంది పోలీసులకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
వారి అండదండలతో తమ దందా సాగిస్తూనే మరో పక్క పోలీసులకు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌లకు యువతులను సరఫరా చేసే కొందరు బ్రోకర్లే తాము యువతులను ఎక్కడికి పంపామో సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ ఫామ్‌హౌస్‌పై దాడులు చేయడం, పట్టుబడిన యువతీయువకులను తమదైన శైలిలో గద్దించడం చేస్తారు.
ఆ తర్వాత ఎపిసోడ్లో యువతులను సేఫ్‌గా సమాచారం ఇచ్చిన బ్రోకర్‌కు అప్పగించి.. పట్టుబడిన విటుల నుంచి అందినంత దండుకుంటున్నారని సమాచారం. ఏదేమైన నగర శివార్లలో జరుగుతున్న చీకటి దందాలపై కొందరు పోలీసుల కాసుల కక్కుర్తి, ఉన్నతాధికారుల నిఘాలోపంతో మహానగరానికి చెడ్డపేరు తీసుకుస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. నిరంతరం ఉన్నతాధికారులు నిఘా ఉంచి అవినీ తి పోలీసు అధికారులు, బ్రోకర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.