సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ )/ఉప్పల్/మల్కాజిగిరి: సీఎం రేవంత్‌రెడ్డి ఉప్పల్ భగాయత్ పర్యటన సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గంలో తాగునీరు, డ్రైనేజీ, నాలా సమస్య, శాంతిభద్రతల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలతో పాటు స్థానికులు ప్రయత్నం చేసే సమయంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
ప్రజల గొంతుకను సీఎం వినకుండా చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారని స్థానికులు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత మేకల మధుసూదన్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కాగా, ప్రజల తరపున ప్రశ్నించడం తప్పా..? అని బీఆర్ఎస్ నేత మేకల మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దానిని కాలరాయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.