Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. అయితే నిరుద్యోగులు నిరసనలు, ధర్నాలు చేసే అవకాశం ఉండటంతో ముందస్తుగానే భారీగా పోలీసులు మోహరించారు.
అలాగే అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించారు. శుక్రవారం ఉదయమే పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్రోడ్ష్ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిన్నటి నుంచి నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.

ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలో నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు
ఉద్యోగాలు ఇవ్వలేమని శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు కదం తొక్కారు. వందలాదిగా రోడ్లపైకి చేరి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. తక్షణమే ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక రూపొందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చికడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి బయలుదేరి అశోక్‌నగర్ చౌరస్తా వరకు దాదాపు 500 మందికి పైగా నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎన్నికల ముందు సెంట్రల్ లైబ్రరీకి వచ్చి.. మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్న మోసం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మాయమాటలు ఆపేసి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరి మానుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అయితే నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఎక్కడికక్కడ ఈడ్చిపడేశారు. పోలీస్ దాడిని ప్రతిఘటించిన నిరుద్యోగులపై విచక్షణారహితంగా లాఠీలతో బాదారు. పోలీస్ వ్యాన్లలోకి తోసి పడేశారు. పోలీసుల దాడిలో పలువురికి గాయాలై.. రక్తం కారుతున్నా వారిని ఈడ్చిపడేయడం పోలీసుల దమననీతికి నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం హైదరాబాద్ నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. వందలాది మంది నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
శాంతియుతంగా వెళ్తున్న నిరుద్యోగులపైకి వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ కనిపించిన ప్రతివారినీ పోలీసు వ్యాన్లలో ఈడ్చిపడేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే అదనుగా పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. నిరుద్యోగులను నిలువరించేందుకు ఎక్కడికక్కడ లాఠీలతో ఇష్టారీతిన దాడులకు దిగారు. పోలీసుల దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన వారిని వ్యాన్లలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పిడిగుద్దులతో, దుర్భాషలాడుతూ పోలీసులు దౌర్జన్యానికి దిగారని నిరుద్యోగులు మండిపడ్డారు.