జూబ్లీహిల్స్, మార్చి 14 : 35 సంవత్సరాల తరువాత హోలీ(Holi) పండుగ రంజాన్ మాసంలో 2 వ శుక్రవారం వచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ గూడా చెక్ పోస్ట్, వెంకటగిరి, గ్రీన్ బావర్చి, ఎల్ ఎన్ నగర్ ప్రాంతాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు అన్ని మసీదులు, టెంపుల్స్ వద్ద ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. రెండు పండుగలు సజావుగా నిర్వహించుకోవడానికి అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హోలీ, రంజాన్ రెండవ శుక్రవారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ పికెట్లను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి వేర్వేరుగా సందర్శించారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్కో పోలీస్ పికెట్‌లో ఎస్ఐ, ఏఎస్ఐలతో పాటు 6 గురు పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పికెట్లతో పాటు మసీదులు, టెంపుల్స్ వద్ద బందోబస్తు నిర్వహించగా.. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.