మేడ్చల్, మే 19 : ఆశ్రయం ఇచ్చి, పని కల్పిస్తానని చెప్పిన పాపానికి మహిళను యువకుడు దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మేడ్చల్ మున్సిపాలిటీ కిష్టాపూర్‌లో ఉన్న మద్యం దుకాణంలో పని చేసే దాసరి లక్ష్మి(50) అత్వెల్లిలో ఆరు నెలలుగా అద్దెకు ఉంటుంది.
కాగా గతంలో పటాన్చెరులో లక్ష్మితో కలిసి డంపింగ్‌యార్డులో పని చేసే ఓ మహిళ కొడుకు కటికె రాకేశ్ జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఏదైనా పని ఇప్పించాలని గతంలో తనకున్న పరిచయంతో లక్ష్మిని రాకేశ్ కోరగా సరే అని చెప్పింది. ఈ నెల 15న మేడ్చల్‌కు రాకేశ్ అతడి తల్లి వచ్చారు. ముగ్గురు కలిసి కల్లు తాగిన అనంతరం రాకేశ్ తల్లి వెళ్లిపోగా రాకేశ్ లక్ష్మితో పాటు అత్వెల్లికి వచ్చాడు. మత్తులో ఉన్న అతడికి లక్ష్మి ఒంటిపైన ఉన్న నగలపై ఆశ పుట్టింది.
అర్ధరాత్రి తర్వాత లక్ష్మిని వంట చేసే కత్తితో గొంతు కోసి హతమార్చాడు. నగలను తీసుకునేందుకు ముక్క, చెవిని కోశాడు. ఆధారాలు లేకుండా ఒంటికి నిప్పటించాడు. నగలు, నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకొని గదికి తాళం వేసి పరారయ్యాడు. పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా రాకేశ్‌ను నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. అతడి వద్ద ఐదు గ్రాముల బంగారు నగలు, 60 గ్రాముల వెండి నగలు, రూ.3500 నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 72 గంటల్లో కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని డీసీపీ కోటి రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, డీఐ సుధీర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.