సిటీబ్యూరో: మీరు ఫలానా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు..పోలీసుల సేవలు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు పడ్డారా..ఇలా వివిధ అంశాలపై గతంలో ఫీడ్ వ్యవస్థలో భాగంగా ఫిర్యాదుదారులకు ఫోన్లు వచ్చేవి. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్ది.. మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకునేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఇలా ఫీడ్ బ్యాక్ సిస్టంతో ప్రజలకు మెరుగైన పోలీసులు సేవలు అందాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఈ వ్యవస్థను అటకెక్కించారనే విమర్శలు వస్తున్నాయి. ఫీడ్ బ్యాక్ వ్యవస్థను పక్కన పెట్టి పోలీస్స్టేషన్ల వద్ద క్యూఆర్ కోడ్ సిస్టంను కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నదంటూ.. కొందరు పోలీసులు పేర్కొంటున్నారు.
పారదర్శకంగా సేవలు అందడం లేదని సామన్యులు విమర్శిస్తున్నారు. పోలీసులు బాధితులను ఏదైనా కేసులో డబ్బులు అడిగినా, నిందితులతో కలిసిపోయినా.. ఎక్కడో ఓ దగ్గర బయటపడుతామనే భయం గతంలో క్షేత్ర స్థాయి సిబ్బంది ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో చాలా మందికి అవినీతికి పాల్పడుతున్నట్లు సిబ్బంది చర్చించుకుంటున్నారు.
ఈ కారణంగానే ఏసీబీకి పోలీస్ శాఖలో పనిచేసే పలువురు సిబ్బంది పట్టుబడుతున్న ఘటనలు బయటపడుతున్నాయి. కాగా, క్షేత్ర స్థాయిలో పోలీసుల పనితీరుపై ఫిర్యాదులు ఇవ్వాలంటే ఏసీపీలు, డీసీపీలు, కమిషనర్‌ను బాధితులు కలవాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. కొన్నిసార్లు ఉన్నతాధికారులను కలిసి సమస్యను వివరించినా.. క్షేత్ర స్థాయి అధికారులదే కరెక్ట్ అనే భావనలో కొందరు అధికారులు ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.