 
                                                            సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): పోలీసులకు పట్టుబడ్డ వేల కోట్ల రూపాయల మోసగాడిని రెండుకోట్ల లంచం తీసుకొని వదిలేసి, నిందితుడు పోలీసుల కండ్లు గప్పి పరారయ్యాడంటూ ఉన్నతాధికారుల వద్ద బుకాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక విచారణలో ఎస్సై లంచం తీసుకున్నట్లు కొన్ని ఆధారాలు లభించడంతో చర్యలు తీసుకున్నారు. అయితే ఈ లంచం వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ విభాగంలో ఇంకా ఎంత మంది పాత్ర ఉందనే విషయంలోను లోతైన విచారణ చేస్తున్నారు.
వివిధ రంగాల్లో పెట్టుబడుల పేరుతో సుమారు మూడువేల కోట్ల వరకు వివిధ రాష్ర్టాలలో మోసం చేసిన ఘరాన మోసగాడిపై నెల రోజుల కిందటే సీసీఎస్‌లో మరో కేసు నమోదయ్యింది. సాఫ్ట్వేర్, మద్యం రంగాల్లో పెట్టుబడుల పేరుతో రూ. 20 కోట్లు వసూలు చేసి మోసం చేశాడంటూ సీసీఎస్‌లో ఒక బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలంటూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు ముంబాయిలో ఉన్నట్లు ఆధారాలు లభించడంతో అతన్ని పట్టుకొచ్చే బాధ్యతను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ బృందానికి అప్పగించారు. వారం రోజుల పాటు ముంబాయిలో ఉన్న టాస్క్‌ఫోర్స్ బృందం గాలించి నిందితుడిని పట్టుకున్నారు. దీంతో సదరు నిందితుడు అతని కారులోనే భార్య, కూతురుతో పాటు హైదరాబాద్‌కు బయలుదేరాడు.
టాస్క్‌ఫోర్స్ ఎస్సై నిందితుడి కారులో కూర్చొని, తమ బృందాన్ని మరో కారులో తమను వెంబడించాలంటూ సూచనలు చేశారు. ఈ సమయంలోనే ఎస్సై .. తనకు రూ. 5 కోట్లు ఇస్తే నిన్ను వదిలేస్తానంటూ ఎస్సై డిమాండ్ చేయగా ఇద్దరి మధ్య బేరసారాలు జరిగాయి, చివరకు రూ. 2 కోట్లు ఇచ్చేందుకు నిందితుడు ఒప్పుకున్నాడు. డీల్‌లో భాగంగా కొంత నగదు తక్కువగా ఉన్నా ఆ డబ్బు తీసుకున్న ఎస్సై సదాశివపేట్‌లో నిందితులను వదిలేశాడు. డబ్బు తీసుకొచ్చిన వారి కారులో నిందితులు ముంబాయికి పరారయ్యారని సమాచారం. ఇంతలోనే వెనుక నుంచి టాస్క్‌ఫోర్స్ బృందం మరో కారులో అక్కడి చేరుకుంది. నిందితులు పరారయ్యారంటూ ఎస్సై వాళ్లకు చెప్పాడు.
ఎస్సై రూ. 2 కోట్ల డీల్ చేసి దర్జాగా నిందితులను వదిలేశాడంటే పోలీసు వర్గాలలో రకరకాల చర్చ జరుగుతుంది. ఒక ఎస్సై అంత పెద్ద డీల్ చేస్తాడంటే నమ్మశక్యంగా లేదని దీని వెనుక మరికొంత మంది అధికారుల అండదండలు ఉండే అవకాశాలుంటాయని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో ఎస్సైకి సహకరించిన వారెవరు అనే విషయంపై ఇప్పుడు నగర పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టాడని పోలీసు వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. ఎస్సైని సస్పెండ్ చేయడం వరకే ఈ కేసు పరిమితమవుతుందా? అతనికి సహరించిన వాళ్లను గుర్తించి చర్యలు తీసుకుంటారా? అనే విషయాలపై స్పష్టత కోసం మరి కొంత సమయం ఎదురు చూడాల్సిందేనని పోలీసు వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
 
                            