సిటీబ్యూరో: దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల కష్టార్జితానికి పెను సవాలుగా మారిన సైబర్‌నేరాలు, ఆర్థికమోసాలకు చెక్ పెట్టాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అనివార్యమని హైదరాబాద్ నగరపోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయంలో శుక్రవారం ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో సజ్జనార్ బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
సైబర్‌నేరగాళ్లు అమాయక విద్యార్థులు, కూలీలకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు కమీషన్ ఆశచూపి, వారి పేర్లతో బ్యాంక్‌ఖాతాలు తెరిపిస్తున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును క్షణాల్లో తాము తెలిచిన మ్యూల్ ఖాతాల ద్వారా తరలిస్తున్నారని, వీటిని అరికట్టడానికి సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏర్పాటు చేయాలన్నారు. ఖాతాలు తెరిచే సమయంలో బ్యాంకు సిబ్బంది పాటించాల్సిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని, ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారుడు భౌతికంగా ఉన్నాడా లేదా నిర్ధారించుకునేందుకు జియోవెరిఫికేషన్, లైవ్ వీడియో కేవైసీని తప్పనిసరి చేయాలన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సీపీ శ్రీనివాసులు, సీసీఎస్ డీసీపీ శ్వేత తదితరులు పాల్గొన్నారు.