సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేసినా వాటిని ఉపయోగించుకోవడంలో రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎల్బీనగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్ చౌరస్తాలో గతంలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడేది. ఈ రద్దీకి తగ్గుట్లుగా ైప్లె ఓవర్లు, అండర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు నిర్మించి, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో స్థానికులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా చౌరస్తాలలో ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా చేయకపోవడం, చిన్నపాటి చర్యలు చేపడితే ఇబ్బందులు పరిష్కారమయ్యే అవకాశాలున్నా అలాంటి వాటిపై దృష్టి పెట్టకపోవడంతో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఆయా చౌరస్తాలలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆర్థికపరంగా ఎలాంటి చర్యలు అవసరం లేకుండా, అధికారులు చొరవ తీసుకొని అక్కడ ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరమున్నా, రెండేండ్లుగా ఆ విషయాన్ని విస్మరిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కొత్తగా పోలీస్ కమిషనరేట్ల ఏర్పడడంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్, మల్కాజిగిరి కమిషనర్‌గా మారడంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న అధికారులు ఆయా సమస్యలపై ఆరా తీస్తున్నారు.
ఒకో విభాగంపై సమీక్ష!
పునర్విభజన తరువాత కొత్తగా ఏర్పడిన కమిషనరేట్‌కు సంబంధించిన ఆయా విభాగాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సమస్యలపై కూడా ఆరా తీశారు. 2016లో సైబరాబాద్ పునర్విభజనకు ముందు ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాలలో ఉన్న ట్రాఫిక్ సమస్యపై అప్పట్లో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేసిన ప్రస్తుత పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి అవగాహన ఉంది. రెండు కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండేది, ఆ తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్బీనగర్లో ైప్లె ఒవర్, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి అక్కడ ట్రాఫిక్ శాశ్వత పరిష్కారానికి పలు అభివృద్ధి పనులు చేశారు. అలాగే సాగర్ రింగ్‌రోడ్డు చౌరస్తాలోను ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించారు. వీటితోపాటు ఉప్పల్ చౌరస్తాలోను పాదచారులకు ఇబ్బందులు కలుగకుండా స్కైవాక్, చౌరస్తాలో రోడ్డు విస్తరణ చేశారు.
అయినా ఎల్బీనగర్, ఉప్పల్ చౌరస్తాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం, నిత్యం వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కమిషనర్ ఆరా తీశారు. సాఫీగా ట్రాఫిక్ వెళ్లేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఎల్బీనగర్, ఉప్పల్ చౌరస్తాలలో ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్న బస్‌స్టాప్‌లను మరోచోటకు మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆ ప్రక్రియను ప్రారంభించారు. చౌరస్తా సమీపంలోనే బస్‌స్టాప్‌లు ఉండడంతో బస్సులు ఆగడం, ప్రయాణీకుల రద్దీ కారణంగా ఆయా చౌరస్తాలలో వాహనదారులకు రాకపోకలు ఇబ్బందిగా మారుతూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నది. మొదట బస్‌స్టాప్‌ల అంశాన్ని పరిష్కరించి, ఆ తర్వాత తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై తగిన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
ట్రాఫిక్ కష్టాలకు ఇలా చెక్ పెట్టండి: సీపీ
సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనరేట్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్(పీఎస్‌ఐఓసీ)లో ట్రాఫిక్ నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై సీజీ అధికారులకు పలు సూచనలు జారీచేశారు. ముఖ్యంగా ప్రమాదకర బ్లాక్ స్పాట్లను గుర్తించి, సరిచేయాలని, అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. వీటితో పాటు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ ఏడీసీపీ జి.హన్మంతరావు, మేడ్చల్ ట్రాఫిక్ ఏడీసీపీ వీరన్న, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ గిరిప్రసాద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.