అబిడ్స్ ఏప్రిల్ 3: ఈ నెల 6న జరగనున్న శ్రీ రామ నవమి శోభాయాత్ర సజావుగా సాగిపోయేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. గురువారం సీతారామ్ బాగ్‌లోని ద్రౌపది గార్డెన్లో అన్ని శాఖల అధికారులతో శోభాయాత్రపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ సీతారాం బాగ్ నుండి హనుమాన్ వ్యాయామ శాల వరకు జరిగే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు యాత్ర తప్పనిసరిగా ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
శోభా యాత్ర దారులు చాలా చిన్నగా ఉండటం వలన, పెద్ద టస్కర్ వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని,ముందస్తుగా వాహనాలతో ఒక ట్రయల్ రన్ ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ సమితి సభ్యులను సూచించారు. డ్రోన్ల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. గుండె జబ్బులకు, వినికిడి సమస్యలకు కారణమవుతున్న డీజే సిస్టమ్‌ను కాకుండా సౌండ్ సిస్టమ్ వాడాలని సూచించారు. శోభా యాత్రలో ఇతర వర్గాలను కించ పరిచే విధంగా పాటలు, ప్రసంగాలు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులను కోరినారు. శోభా యాత్ర నిర్వాహకులు విగ్రహాల ప్రతిమల ఎత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
శ్రీ రామ నవమి శోభా యాత్రకు హైదరాబాదు సిటీ పోలీసు అన్ని విభాగాలను కలిపి మరియు స్పెషల్ పోలీసులు కలుపుకుని 20 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నేరస్తులపై షీ టీం, సీసీఎస్ పోలీసులతో వారి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశా మని తెలిపారు. సమావేశము అనంతరం సీపీ సీవీ ఆనంద్, జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు, ఆర్ఆండ్ బీ, విద్యుత్తు, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు కలిసి శోభా యాత్ర ప్రధాన ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు.
మంగళ్‌హాట్ నుంచి ఊరేగింపు మొదలై పురానాపూల్ గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, సిద్ది అంబర్ బజార్, అఫ్జల్ గంజ్, గౌలిగుడ, కోటి ఆంధ్రా బ్యాంకు చౌరస్తాల ద్వారా ప్రయాణించి హనుమాన్ వ్యాయామ శాల గ్రౌండ్ వద్ద ముగుస్తుంది. ఈ కార్యక్రమం లో విక్రమ్ సింగ్ మాన్, లా ఆండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ లా ఆండ్ ఆర్డర్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీలు జి.చంద్ర మోహన్, బి. బాలస్వామి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, డీవైఆర్ఎం ఆర్టీసీ శ్రీనివాసరావు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సెక్రటరీ , భగవంతరావు తదితరులు పాల్గొన్నారు.