CV Anand | సిటీ బ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రంజాన్ మాసంలోని రెండో శుక్రవారం, హోలీ పండుగ 35 ఏండ్ల తర్వాత ఒకేసారి వచ్చాయని, రెండు వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ పోలీసులకు సూచించారు. హైదరాబాద్ సిటీ పోలీసు అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి జోన్ లోని సున్నితమైన, ముఖ్యమైన ప్రాంతాల్లో పికెట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.
రెండు పండుగలు సజావు గా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అసాంఘిక శక్తులు, వెగాబాండ్ లపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. రంగుల హోలీ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. లా అండ్ ఆర్డర్ అడిషినల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ చైతన్య కుమార్, అన్ని జోనల్ అధికారులు పాల్గొన్నారు.