మొయినాబాద్, ఆగస్టు15 : అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్‌డే పార్టీ నిర్వహించుకున్న విదేశీయులు పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా బర్త్‌డే జరుపుకొంటున్న ఫామ్ హౌస్‌పై దాడులు నిర్వహించి.. పార్టీని భగ్నం చేశారు. వారి నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. 51 మంది పురుషులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డితో కలిసి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఎక్కువ మొత్తంలో ఉగాండా దేశానికి చెందిన వారితో పాటు ఒకరిద్దరు ఇతర దేశాలకు చెందిన పురుషులు, మహిళలు వీసా తీసుకుని దేశానికి వచ్చి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అయితే ఉగాండా దేశానికి చెందిన ‘మమ’ అనే మహిళ బర్త్‌డే ఉండటంతో ఆమె ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి బర్త్‌డే పార్టీకి తమకు పరిచయం ఉన్న వారిని ఆహ్వానించింది.
యుగాండా దేశానికి చెందిన వారు 34 మంది బర్త్ డే పార్టీకి వచ్చారు. వారితో పాటు కెన్యా తదితర దేశాలకు.. దేశాలకు చెందిన వారిని ఒకరిద్దరి చొప్పున ఆహ్వానించింది. బర్త్ డే పార్టీని రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం జాగీర్ రెవెన్యూలోని ఎస్కే నేచర్ రిట్రీట్ ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసింది. గురువారం రాత్రి బర్త్‌డే పార్టీ కేక్ కట్ చేసిన తరువాత మద్యం పార్టీ నిర్వహించుకుంటున్నారు. స్థానిక పోలీసులకు, ఎస్ఓటీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఫామ్ హౌస్‌పై సంయుక్తంగా దాడి చేసి బర్త్‌డే పార్టీని భగ్నం చేశారు. తనిఖీలు నిర్వహించగా, పార్టీలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 12 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. నార్కోటిక్స్, ఎక్సైజ్ పోలీసులు పరీక్షలు చేశారు. గతంలో గంజాయి తీసుకోవడంతో కొందరికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. అనుమతి లేకుండా తీసుకొచ్చిన 90 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విదేశీయుల్లో కొందరికి ఇప్పటికే వీసా గడువు ముగియడంతో పాటు కాలం చెల్లిన పాస్‌పోర్టులతో దర్జాగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీసా, పాస్‌పోర్టులను, ఐడీ కార్డులను ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఇప్పటికే 36 మందికి వీసా గడువు ముగియడంతో పాటు పాస్ పోర్టు రెన్యువల్ గడువు కూడా ముగిసినట్లు గుర్తించారు. వీసా గడువు ఉండి, పాస్ పోర్టు వాలిడ్ ఉన్న 15 మందిని పోలీసులు వదిలి పెట్టగా, వీసా గడువు, పాస్ పోర్టు రెన్యువల్ గడువు అయిపోయిన వారిని దేశం దాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఫామ్‌హౌస్ యజమాని, పార్టీ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తాం. లిక్కర్ కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇమిగ్రేషన్ అధికారులు కూడా రంగంలోనికి దింపి వారి వీసాలు, పాస్‌పోర్టులను చెక్ చేయించాం. ఎవరు ఉద్యోగ వీసా మీద వచ్చారు..? ఎవరు స్టూడెంట్ వీసా మీద వచ్చారు..? ఎవరికి పాస్ పోర్టులు ఉన్నాయి..?ఎవరికి ఫేక్ పాస్ పోర్టులు ఉన్నాయని తెలుసుకునేందుకు ఇమిగ్రేషన్ అధికారులు వచ్చారు. వారి పూర్తి వివరాలు కూడా సేకరించారు. అక్రమంగా ఎవరైనా మన దేశంలోనికి వచ్చిన, ఫేక్ పాస్ పోర్టులతో దేశంలో చలామణి అవుతున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు నియమ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అదే విధంగా నార్కోటిక్స్, ఎక్సైజ్ శాఖ పోలీసులు పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం.