Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 30 : తన ఆటోలో ఎక్కిన ప్రయాణికుడి మీద అకారణంగా దాడికి పాల్పడిన డ్రైవర్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన ప్రఫుల్ కులకర్ణి మాదాపూర్‌లోని ఓ ప్రయివేటు హాస్టల్లో నివాసం ఉంటూ ఘట్కేసర్లోని శ్రీనిధి యూనివర్సిటీలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీకి వెళ్ళే క్రమంలో మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దాకా ఆటోలో వచ్చాడు. ఆటో దిగిన తర్వాత రోజులాగే రూ.20 స్కాన్ చేశాడు. అయితే రూ. 50 ఇవ్వాలంటూ ఆటో డ్రైవర్ డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రఫుల్ కులకర్ణి మీద ఆటో డ్రైవర్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు బాధితుడు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.