సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో హాషిష్ ఆయిల్, విదేశీ గంజాయి విక్రయిస్తున్న నలుగురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 465 గ్రాముల హాషిష్ ఆయిల్, 20 గ్రాముల వీదేశీ గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం.. నగరంలో నివసిస్తున్న ప్రేమ్ ఉపాధ్యాయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. పులిపాక హస్తోష్ ట్యాటు ఆర్టిస్ట్. స్నేహితులైన వీరిద్దరు గంజాయికి అలవాటు పడి, చివరకు మత్తు పదార్థాల విక్రయాన్నే వృత్తిగా మార్చుకున్నారు.
ఈ క్రమంలో బెంగుళూరుకు చెందిన డ్రగ్స్ సరఫరాదారుడు షేక్ నబీ హుస్సేన్ అలియాస్ బిట్టు నుంచి వెయ్యి రూపాయలకు గ్రాము గంజాయి, రూ.1000కి గ్రాము హాషిష్ ఆయిల్ కొనుగోలు చేసి నగరంలో రూ.2500నుంచి రూ.3000ల వరకు విక్రయిస్తున్నారు. కాగా శనివారం గచ్చిబౌలి ప్రాంతంలో హాషిష్ ఆయి ల్, విదేశీ గంజాయి విక్రయించేందుకు యత్నిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2క్షల విలువ చేసే 285 గ్రాముల ఆయిల్, 20గ్రాముల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు నుంచి సరఫరా చేస్తున్న షేక్ నబీ హుస్సేన్ పరారీలో ఉన్నాడు. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ సీఐ ఎంపీఆర్ చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుళ్లు బి.భాస్కర్‌రెడ్డి, అజీమ్, శ్రీధర్, కానిస్టేబుళ్లు ప్రకాశ్, రాకేశ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
సైదాబాద్ : మలక్‌పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటకు చెందిన మాణికప్ప, అంబర్‌పేటకు చెందిన దుర్గాప్రసాద్‌లు ఏపీ, విశాఖపట్నం జిల్లాలోని ఆరకు ప్రాంతం నుంచి హాషిష్ ఆయిల్‌ను కొనుగోలుచేసి.. నగరంలో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరు ఆయిల్ విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి 180గ్రాముల ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో మలక్‌పేట ఎక్స్‌జ్ ఎస్సై సుజాత, హెడ్ కాన్సిస్టేబుళ్లు ప్రసాద్, శ్రీనివాసులు, సురేందర్‌రావు, కానిస్టేబుళ్లు శంకర్, వినోద్‌కుమార్, విక్రమ్, రాము, ప్రియాంక, జితేందర్ తదతరులు పాల్గొన్నారు.