బంజారాహిల్స్, జూన్ 16 : పిల్లల చదువు కోసం అంటూ కొంతమందిని మోసం.. అధిక వడ్డీలు ఇస్తానంటూ మరికొంత మందికి బురిడీ.. కిరాయి ఇంట్లో ఉంటూ చుట్టుపక్కల వారితో చనువుగా ఉంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ఘరానా లేడీని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లాకు చెందిన కే.శ్రీలక్ష్మి, ఆమె భర్త సత్యప్రసాద్‌తో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసించేది. ఇంటి యజమానితో పాటు వీధిలో అందరితో అత్యంత సన్నిహితంగా ఉంటూ కుమార్తె చదువుకోసం అంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసింది.
కొంతమందికి వడ్డీలు ఆశచూపి రూ.2 కోట్ల మేర వసూలు చేసి ఏడాది క్రితం రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఉడాయించింది. ఆమెకు సహకరించిన కొంతమంది మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇస్తానంటూ కొన్నాళ్లపాటు కాలయాపన చేసింది. తమను మోసం చేసి ఉడాయించిన శ్రీలక్ష్మి దంపతులపై రంగనాథ్ అనే వ్యక్తితో పాటు మరికొంతమంది బాధితులు ఏడాది క్రితం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సుమారు 2 కోట్ల దాకా శ్రీలక్ష్మి మోసం చేసినట్లు తేలడంతో కేసును గత మార్చిలో సీసీఎస్‌కు బదిలీ చేశారు.
బాధితులకు నెలరోజుల్లోగా డబ్బులు తిరిగి చెల్లిస్తానంటూ సీసీఎస్‌లో ఒప్పుకున్న శ్రీలక్ష్మి ఆ తర్వాత పారిపోయింది. దీంతో అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితురాలు శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపర్చగా నిందితురాలికి 14 రోజుల రిమాండ్ విధించారు.