న్యూఢిల్లీ, జూలై 23: ఇన్ఫోసిస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.7,769 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 12.2 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14 శాతం ఎగబాకి రూ.48,211 కోట్లకు చేరుకున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికిగాను ఆదాయంలో వృద్ది 1.5 శాతం నుంచి 3 శాతం లోపు ఉండవచ్చునని తన గైడెన్స్‌లో పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిగా ఉండటం వల్లనే ఈ ఏడాది ఆదాయంలో వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితంకానున్నదని కంపెనీ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ తెలిపారు. ఉద్యోగుల పరిహారం పెంపు రెండు విడుతలగా అక్టోబర్, జనవరి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇన్ఫోసిస్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కంపెనీ సీఈవోగా ఆశీష్ కుమార్ దాస్ నియమితులయ్యారు. ఈ నియామకం వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది.