ముంబై, జూలై 23: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగోరోజూ గురువారం కూడా సూచీలు భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా మదుపర్లలో సెంటిమెంట్ నీరుగారింది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 363.66 పాయింట్ల నష్టంతో 76,391.39 వద్దకు పడిపోయింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 126.65 పాయింట్లు కోల్పోయి 23,869.60 వద్ద స్థిరపడింది. దీంతో గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,760 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టపోగా, నిఫ్టీ కూడా 464.70 పాయింట్లు లేదా 1.90 శాతం పతనం చెందాయి.