ఏదైనా పని అప్పగిస్తే చాలు… ‘నాకు టైం లేదు. వీలు కాదని’ మనలో చాలామందిమి తప్పించుకుంటాం. కానీ, ఆ మహిళ మనందరిలా కాదు. ఆమె కాళ్లు కదలవు, శరీరం సహకరించదు. అయినా కుంచె పట్టి ప్రపంచానికి రంగులు పూసింది. బాల్యంలోనే ‘కండర క్షీణత వ్యాధి’తో మంచానికి పరిమితమైంది. నాలుగు గోడల నడుమ జీవిస్తూ కళాత్మక పెయింటింగ్స్ వేస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నది షేక్ నఫీస్. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన హార్ట్ ఏబుల్డ్ చిత్రకళా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన తన కళాఖండాలు ఎందరినో ఆలోచింపజేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగుతున్న నఫీస్ జిందగీతో ముచ్చటించింది. ఆ విశేషాలు తన మాటల్లోనే…
అందరిలాగే నేను కూడా చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ పెరిగాను. గొప్పగా చదువుకోవాలని చక్కగా బడికి వెళ్లేదాన్ని. ఏమైందో తెలియదు కానీ అనుకోకుండా నా కాళ్లు, చేతులు బలహీనపడుతూ వచ్చాయి. అమ్మానాన్నలు భయపడి పోలియో అనే అనుమానంతో డాక్టర్లకు చూపించారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. నేను పదో తరగతికొచ్చే సరికి లేవలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా మంచానికే పరిమితమయ్యాను. నాకు ‘కండర క్షీణత వ్యాధి’ వచ్చిందని వైద్యులు చెప్పడంతో తట్టుకోలేకపోయాను. కదల్లేను, నడవలేను, శరీరమంతా బలహీనంగా మారిపోయింది. నా జీవితం ఓ చీకటి గదికే పరిమితమైంది. నా వ్యాధిని చూసి అమ్మానాన్న తట్టుకోలేకపోయారు. నా ఒంటరి తనాన్ని వాళ్లు చూడలేక చిన్నప్పటినుంచి నాకు ఎంతో ఇష్టమైన డ్రాయింగ్ వేయమని పెన్సిళ్లు, డ్రాయింగ్ షీట్లు తెచ్చి చేతికిచ్చేవారు. అలా ఒంటరిగా ఉన్న నాకు డ్రాయింగ్ తోడైంది. నా ఆలోచనలన్నీ బొమ్మలు వేయడం పైనే కేంద్రీకరించడం మొదలుపెట్టాను. అలా కుంచె నా నేస్తమైంది.
బొమ్మలు వేయడం హాబీగా పెట్టుకున్న నాకు వాటిని నలుగురికీ చూపించాలన్న ఆలోచన కూడా రాలేదు. నాకు వచ్చిన వ్యాధి గురించి తెలుసుకునేందుకు సారంగి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఖాజా అఫ్రీది ఓసారి మా ఇంటికొచ్చాడు. నా గది నిండా పెయింటింగ్స్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ ఎక్కడ కొన్నారని అడిగిన ఆయనకు ‘నేనే వేశాను’ అని సమాధానమిచ్చాను. ‘నిజమా!’ అంటూ చాలాసేపు వాటినే అలా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత నమ్మకం కలిగి ఇంతమంచి పెయిటింగ్స్ పదిమందికీ చూపితే ఎందరికో స్ఫూర్తి కలుగుతుందని రవీంద్రభారతీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టిస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే నేను వేసిన పెయింటింగ్స్‌తో 2018లో రవీంద్ర భారతిలో రెండు రోజులపాటు ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఆ ప్రదర్శన నా జీవితాన్నే మార్చేసింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దాదాపు 20 ఏండ్లు బయటి ప్రపంచం తెలియని నేను ఆరోజు బయటికొచ్చాను. యాదృచ్ఛికంగా కేటీఆర్ గారు మా ప్రదర్శనకొచ్చారు. నా పెయింటింగ్స్ చూసి ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. నా దగ్గరికొచ్చి ఆరోగ్య సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడే స్పెషల్ ఆర్టిస్ట్ పింఛన్ కింద నెలకు రూ.10వేలు అందజేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఆయన చేసిన మేలుకు గుర్తుగా ఆయన ఫొటోను డ్రాయింగ్ వేసిచ్చాను. అప్పుడున్న మెట్రో ఎండీ 20 పెయింటింగ్స్ కొని మెట్రో స్టేషన్లలో పెట్టించారు.

మొదటి ప్రదర్శనతో నాలో కొత్త ఉత్సాహం మొదలైంది. బయటి ప్రపంచాన్ని చూడాలన్న నా కోరిక అతికొద్ది రోజుల్లోనే నేరవేరింది. 2021లో అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఢిల్లీలో రెండురోజులపాటు ప్రదర్శన ఏర్పాటు చేసుకున్నాం. ఆ తరువాత ప్రపంచంలోనే పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్‌గా పేరున్న దుబాయ్‌లో కూడా నా చిత్రాలు ప్రదర్శించారు. ఇప్పటివరకు 400 వరకు పెయింటింగ్స్ వేసుంటాను. వాటిలో చాలా వరకు నా గురించి నేను వేసుకున్నవే ఉన్నాయి. వాటిని చూస్తే ఒంటరితనాన్ని గుర్తుకు తెచ్చే భావాలే గుర్తొస్తాయి. దాంతో పాటు ప్రకృతినీ చూపించాను. నా వయసుతోపాటు నాకొచ్చిన వ్యాధి కూడా పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు అరలీటర్ వాటర్‌బాటిల్ ఎత్తిన నాకు ప్రస్తుతం ఖాళీ నీళ్ల సీసా ఎత్తాలన్నా ఇబ్బందిగానే ఉంది. కంటి చూపు తగ్గింది. చేతి బలం క్షీణిస్తోంది. ఒకప్పుడు రెండు మూడు గంటలపాటు పెయింటింగ్ వేస్తూ కూర్చునేదాన్ని. ఇప్పుడు గంటసేపు కూడా కూర్చోలేకపోతున్నాను.

నా కళను గుర్తించి ఈశ్వరీబాయి అవార్డుతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, సన్మానాలతో సత్కరించాయి. నాన్న రైల్వే ఉద్యోగిగా పనిచేయడం వల్ల ఆయన చనిపోయినా కూడా ఆయనకొచ్చే పెన్షన్, నాకొచ్చే పెన్షన్‌తో కుటుంబం నెట్టుకొస్తున్నాం. నాకో చెల్లి కూడా ఉంది. తను కూడా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఈ వ్యాధి బారిన పడింది. అయినా డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంట్లోనే గ్లాస్ వర్క్ చేస్తుంటుంది. ఇప్పుడున్న యువత చిన్న చిన్న విషయాలకే మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నా కష్టంతో పోలిస్తే మీ కష్టాలు చాలా చిన్నవి. శరీరం సహకరించలేని నేనే ఇంతమంచి పెయింటింగ్స్ వేస్తున్నానంటే మీరు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరు. ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ప్రస్తుతం నేను బొమ్మలు గీయడం నెమ్మదించినా మీ అందరిలో ఆత్మైస్థెర్యం నింపేందుకే ఇటీవల ఇవి ప్రదర్శనకు పెట్టాను.
నా జీవితంలో ఆ ఇద్దరినీ అస్సలు మర్చిపోను. ఒకరు నాకు జన్మనిచ్చిన నా తల్లి, మరొకరు నాకంటూ గుర్తింపు తెచ్చిన ఖాజా అఫ్రీది. నా బాల్యం నుంచి ఇప్పటివరకు నాకు సేవలు చేస్తూనే ఉంది నా కన్నతల్లి. ఆమె రుణం వచ్చే జన్మలోనైనా తీర్చుకోవాలి. మరుగున పడిన నా కళను వెలుగులోకి తెచ్చారు ఖాజా భాయ్. ప్రతి ప్రదర్శనలో నా పెయింటింగ్స్‌ను పరిచయం చేశాడు. ఆయన లేకుంటే నా పెయింటింగ్స్‌కు ఇంత ఆదరణ లభించేది కాదు. నాకు ఒక సోదరుడిలాగా తోడున్నాడు.