సిటీబ్యూరో, మే 11, (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్నది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల విభాగం అధికారులు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ మాదిరిగానే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ‘పోల్ క్యూ రూట్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రానికి దారి తెలుసుకోవడంతో పాటు అక్కడ ఓటర్లు ఎంతమంది బారులు తీరారనే వివరాలను తెలుసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో ‘పోల్ క్యూ రూట్’ యాప్‌ను అసెంబ్లీ ఎన్నికలు-2023 సమయంలో ‘మై జీహెచ్ఎంసీ’ మొబైల్ యాప్‌లో ప్రవేశపెట్టారు. బల్దియా వెబ్సైట్లోనూ లింకు పెట్టారు. దానిని క్లిక్ చేసి.. జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం.. పోలింగ్ కేంద్రం పేరు ఎంచుకోవాలి. సదరు పోలింగ్ కేంద్రానికి గూగుల్ పటం దారి చూపుతుంది. ఆ పోలింగ్ కేంద్రంలో ఎంత మంది వరుసలో నిల్చున్నారనే సమాచారం కూడా కనిపిస్తుంది.
జీహెచ్ఎంసీ విభాగం ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపిణీ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల కొంతమందికి ఇవి అందకపోయి ఉండవచ్చు. అయితే స్లిప్ లేనంత మాత్రాన ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్ ద్వారా మీరు మీ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలను చూసుకోవచ్చు. మీ వద్ద ఓటరు కార్డు ఉంటే ఆ నంబర్‌ను 1950, 9211728082 నంబర్లకు పంపిస్తే.. మీ పోలింగ్ కేంద్రం వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో మీకు లభిస్తాయి. 24 గంటల పాటు పని చేసే టోల్ ఫ్రీ నంబర్ 1950కి ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు నంబర్ సాయంతో పోలింగ్ కేంద్రం, బూత్ నంబర్, క్రమసంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
ఎన్నికల సంఘానికి చెందిన ఓటర్ హెల్ప్ లైన్, యాప్ డౌన్ లోడ్ చేసుకొని కూడా వివరాలు పొందవచ్చు. https://www.ceotelangana. nic.in/అనే వెబ్ సైట్లో Search Your Name in Voter List ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఓటరు గుర్తింపు కార్డు లేదా మొబైల్ నంబర్ లేదా పేరును ఇవ్వడం ద్వారా ఏ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చో తెలుసుకోవడంతో పాటు డిజిటల్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.