న్యూఢిల్లీ: విమానాల్లో ప్రయాణికులు పవర్ బ్యాంక్‌లు వాడటంపై నిషేధం విధిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిబంధనలు కఠినతరం చేసింది. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయమై విమానాశ్రయాల్లో మైక్‌ల ద్వారా ఆ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. విమానంలో ఎవరైనా పవర్ బ్యాంకులను వాడుతూ కనిపిస్తే వెంటనే వారిని ఆ పని చేయకుండా సిబ్బంది వారిస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీలు కలిగి ఉండే పవర్ బ్యాంక్‌లు దెబ్బ తిన్నా, ఎక్కువగా వేడెక్కినా, సరిగా పని చేయకపోయినా అగ్ని ప్రమాదానికి కారణమయ్యే అవకాశాలున్నాయి.
విమానం క్యాబిన్ లోపల చిన్న బ్యాటరీ పేలినా దాని ప్రభావం త్వరగా వ్యాపించి నియంత్రించడం కష్టమవుతుంది. నిబంధనల ప్రకారం పవర్ బ్యాంకులను క్యాబిన్ లగేజీలో మాత్రమే అనుమతిస్తారు. అయితే వాటిని ప్రయాణ సమయంలో ఉపయోగించకూడదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రయాణానికి ముందుగానే తమ ఫోన్లు తదితర పరికరాలను పూర్తిగా చార్జింగ్ చేసుకొని ఉంచుకోవాలని.. భద్రత దృష్ట్యా నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి వారు సహకరించాలని విమానయాన శాఖ విజ్ఞప్తి చేసింది.