హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రెండు అతి ప్రధాన రహదారుల పనులు మరీ నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్‌కు అతి కీలకమైన ఈ మార్గాల్లో పనుల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్-వరంగల్ రహదారిలో భాగమైన ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంలో ఇంకా 70 శాతం పనులు పూర్తి కావాల్సి ఉండగా, హైదరాబాద్-విజయవాడ రహదారిలో బ్లాక్స్పాట్ల సవరణ పనులు మరో 80 శాతం జరగాల్సి ఉన్నవి. రోడ్లను ఇష్టమొచ్చినట్టు తవ్వి పనులు నిర్వహిస్తుండటం, సర్వీసు రోడ్డును కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆ మార్గాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇప్పటికే ఆర్అండ్బీ శాఖ మంత్రి పనులు పూర్తిచేసేందుకు లక్ష్యాలు విధించినా నెరవేరలేదు, తాజాగా వచ్చే ఏడాది దసరాకు పూర్తిచేస్తామని ఇచ్చిన హామీ నిజమయ్యే పరిస్థితి అంతకన్నా కనిపించడం లేదు.
నత్తనడకన పనులు
ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పల్-నారపల్లి మధ్య దాదాపు 6.2 కి.మీ.ల 6 లేన్ల ఫ్లైఓవర్‌ను 2018లో చేపట్టారు. ఒప్పందం ప్రకారం పనులు మూడేండ్లలో పూర్తికావాలి. మొదట భూసేకరణ సమస్య కారణంగా పనుల్లో జాప్యం కాగా, అనంతరం పనులు దక్కించుకున్న ఏజెన్సీ దివాలా తీయడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సమస్యలన్నీ పరిష్కారమైనా ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్లక్ష్యం, ఎన్హెచ్ఏఐ-ఆర్అండ్బీ అధికారుల మధ్య సమన్వయలోపంతో పనులు కదలడం లేదు. రోడ్డును ఇష్టమొచ్చినట్లు తవ్వి పనులు చేస్తుండటం, సర్వీసు రోడ్డు కూడా సరిగ్గా వేయకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణం ఇబ్బందిగా మారింది. మొత్తం 142 స్లాబులకు కేవలం 45 మాత్రమే పిల్లర్లపై అమర్చడం, 143 పిల్లర్లకు మరో 28 నిర్మాణాలు చేపట్టాల్సి ఉండటం చూస్తుంటే పనులు ఎంత నెమ్మదిగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా, బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులే తప్ప గడచిన రెండేండ్లలో 10 శాతం పనులు కూడా జరగకపోవడం గమనార్హం.
భయపెడుతున్న బ్లాక్స్పాట్లు
హైదరాబాద్-విజయవాడ మధ్య 270 కి.మీ.ల పరిధిలో 17 బ్లాక్‌స్పాట్ (తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు)లను గుర్తించారు. రోడ్డును సరిదిద్దేందుకు కేంద్రం నేషనల్ బ్లాక్‌స్పాట్స్ రెక్టిఫికేషన్ ప్రోగ్రాం కింద నిరుడు రూ.325 కోట్లు కేటాయించింది. నిధులతో అవసరాలకు అనుగుణంగా లేన్ విస్తరణ, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, సర్వీస్‌రోడ్లు వాటి నిర్మాణాలు, సైన్‌బోర్డుల ఏర్పాటు పనులు చేపట్టాల్సి ఉన్నది. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట ఈనాడు జంక్షన్, జనగామ క్రాస్‌రోడ్డు, పిల్లలమర్రి క్రాస్‌రోడ్డు, దురాజ్‌పల్లి, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ, కట్టకొమ్ముగూడెం, మేళ్లచెర్వు క్రాస్‌రోడ్డు, మునగాల తదితరచోట్ల పనులు నిర్వహించాల్సి ఉండగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. చౌటుప్పల్, చిట్యాల, పెద్దకాపర్తి, సూర్యాపేట, ఈనాడు జంక్షన్, కోదాడవైపు ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉండగా, ఇంతవరకు చిట్యాల, పెద్దకాపర్తి, సూర్యాపేట, ఈనాడు జంక్షన్ తదితరచోట్ల మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, నారాయణపురం తదితరచోట్ల అండర్‌పాస్‌లు నిర్మించాల్సి ఉన్నా పనులే మొదలు కాలేదు. పనుల కోసం రోడ్డును తవ్విన అధికారులు వాహనాల రాకపోకలకు సర్వీసు రోడ్డును, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఇంకా ఇబ్బందులుపడుతున్నారు. ఈ మార్గంలో సగటున ప్రతి 20కి.మీ.లకు ఒక బ్లాక్‌స్పాట్ ఉండగా, ప్రతిచోటా పనుల పరిస్థితి ఇలాగే ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది.
మంత్రి హామీకే దిక్కులేదు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ రెండు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి ఏడాదిలోగా పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మరో సమీక్ష జరిపి వచ్చే ఏడాది దసరా నాటికి (అక్టోబర్-2026) పూర్తిచేస్తామని ప్రకటించినా పనుల నడక చూస్తుంటే ఇప్పుడప్పుడే పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రెండు ప్రాజెక్టులను అతి కీలకమైనవిగా నిర్ణయించి పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
విజయవాడ హైవే బ్లాక్స్పాట్ల పురోగతి ఇలా..

ఉప్పల్- నారపల్లి ఫ్లైఓవర్ పనుల వివరాలు
