హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణశాఖ మంత్రి మాజీ ఓఎస్డీ ఆ బాధ్యతల నుంచి తొలగించినా తిష్ట వేసి కూర్చున్నారు. పీసీబీలోని తనకు అనుకూల, సన్నిహిత అధికారులకు అడగ్గానే ఉద్యోగోన్నతులు కల్పిస్తూ నిబంధనలకు మంగళం పాడుతున్నారు. మండలిని గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారీతిగా వ్యవహరించడంతో ఆయనను పీసీబీ నుంచి తొలగించినా అంతర్గతంగా తనపని తాను చేసుకుంటున్నారని, మంత్రికి సంబంధించిన అన్ని ఫైళ్లు ఇప్పటికీ ఆయనే చక్కబెడుతున్నారనే చర్చ జరుగుతున్నది. పర్యావరణ మంత్రి పేషీకి వచ్చే ప్రతి ఫైల్‌కూ షాడో మంత్రి ఇష్టానుసారమే క్లియరెన్స్ ఇస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తున్నది. ఈ విషయాల్లో ప్రభుత్వం, సీఎంవో సీరియస్‌గా ఉన్నా అంతర్గతంగా ఆయన మాత్రం యాక్టివ్‌గా ఉన్నట్టు సమాచారం. అత్యంత సన్నిహితుడైన పీసీబీ సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్‌ను నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్‌గా నియమించడంలో చక్రం తిప్పినట్టు వినికిడి.
నేషనల్ గ్రీన్కార్ప్స్ విభాగం కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ అధికారిని ఎన్జీసీకి డైరెక్టర్‌గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారు. ఆ అధికారి కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర పర్యావరణ మంత్రి ‘విచక్షణ’అధికారాలతో సంబంధిత అంశాలపై అనుభవం కలిగిన పీసీబీలోని సీనియర్ అధికారికి డైరెక్టర్‌గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించవచ్చు. ఇప్పుడు మంత్రి విచక్షణ అధికారాన్ని షాడోమంత్రి అస్త్రంగా మార్చుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు తొలగించిన డైరెక్టర్ కొత్తగా నియామకమైన అధికారి కంటే సీనియర్, మరో ఆరునెలల్లో ఉద్యోగవిరమణ చేయబోయే విషయాలను కూడా పట్టించుకోకుండా తొలగిస్తూ మాజీ ఓఎస్డీ సన్నిహితుడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్ తొలగింపు వ్యవహారంలో సీఎంవో అధికారులు అభ్యంతరం చెప్పినా లెక్కచేయకపోగా, ఈ వ్యవహారంలో ఆయనకు భారీగానే లబ్ధి చేకూరినట్టు సమాచారం.
ఎన్జీసీ డైరెక్టర్‌గా ఇప్పటిదాకా సీనియర్ సోషల్ సైంటిస్ట్ బాధ్యతలు నిర్వహించారు. పీసీబీలో ఈ పోస్టు ఒక్కటే ఉంటుంది. ఆయన సీనియారిటీ ఆధారంగా డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన నుంచి వేరొకరికి బాధ్యతలు అప్పగించాలంటే జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ ఉన్నారు. కానీ జేసీఈఎస్తో పాటు తాజాగా నియమితులైన సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు కంటే సీనియర్ ఆఫీసర్లు కాలుష్య నియంత్రణ మండలిలో 10 మందికి పైగానే ఉన్నారు. ప్రొటోకాల్, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి షాడోమంత్రి సన్నిహితుడికి బాధ్యతలు అప్పగించేలా చక్రం తిప్పినట్టు టాక్. అందులో భాగంగా సదరు అధికారి వద్దకు మాజీ ఓఎస్డీ పలుసార్లు వచ్చి మంతనాలు జరిపినట్టు తెలుస్తున్నది. దీనిపై పీసీబీ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. సదరు అధికారి ఇప్పటికే కాలుష్య నియంత్రణ ల్యాబ్‌కు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు ఎన్‌క్యాప్ రాష్ట్ర నోడల్ అధికారిగా కొనసాగుతున్నారు. తాజా గా ఎన్జీటీ డైరెక్టర్ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో ఒకే అధికారి ఇ న్ని కీలక బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారని పలువు రు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్జీసీ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు 25 ఏండ్లుగా పీసీబీలో పాతుకుపోయారు. 2001లో కర్నూలు నుంచి సనత్‌నగర్‌లోని హెడ్ ఆఫీస్‌కు బదిలీ అయి, అప్పటి నుంచి ఉద్యోగోన్నతులు పొందుతూ ఉద్యోగులు, సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నారు. పీసీబీ మెంబర్ సెక్రటరీ సహా సీనియర్ అధికారులను సైతం లెక్కచేయని ఆయనకు ఉద్యోగోన్నతులు తప్ప బదిలీ ఉండదని ‘పీసీబీలో పాతుకుపోయిన సీనియర్ అధికారి’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల కథనం ప్రచురించింది. అది కాలుష్య నియంత్రణ మండలిలో ప్రకంపనలు సృష్టించడంతో ఆ అధికారిని బదిలీ చేస్తారనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కదలడం ఇష్టంలేని అధికారి హెడ్ ఆఫీస్‌లోనే ఉండొచ్చనే ఉద్దేశంతో ఎన్జీసీ డైరెక్టర్ పదవిపై కన్నేశారని సమాచారం.