సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రక్రియలో నామినేషన్ దరఖాస్తుల పరిశీలన ఉత్కంఠంగా సాగింది. బుధవారం ఉదయం నుంచి మొదలుపెట్టిన దరఖాస్తుల ప్రక్రియను రాత్రి వరకు అధికారులు నిర్వహించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్ దరఖాస్తులను ఎన్నికల అధికారులకు అందజేయగా..పరిశీలన తర్వాత మొత్తం అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన అంశం కీలకంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను ఎన్నికల్లో ఎదుర్కొనలేక కాంగ్రెస్ అనుబంధ సోషల్ మీడియా వేదికగా నామినేషన్లపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి విస్తృతంగా సాగింది. దీంతో స్క్రూటినీ ప్రక్రియపై పార్టీల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఉత్కంఠతో ఎదురుచూశారు.
తీరా కాంగ్రెస్ చేసిన తప్పుడు వాదనలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌కు క్లియరెన్స్ వచ్చింది. అదే సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ఉన్న లోపాలపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే విధంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్‌ను కూడా ఆమోదించినట్లుగా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. వందల్లో నామినేషన్లు వచ్చినా… సాయంత్రం 6 గంటల నాటికి ఎన్నికల అధికారులు విడుదల చేసిన ప్రకటన మేరకు చెల్లుబాటు అయినవి మాత్రం 60లోపే ఉన్నట్లుగా తెలిసింది.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ నామినేషన్‌ను తిరస్కరించాలంటూ కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సోషల్ మీడియా బృందాలతో కలిసి విస్తృతంగా విషప్రచారానికి తెరలేపింది. స్క్రూటినీ ప్రక్రియ మొదలు కాకుండానే ఆమె దరఖాస్తుల్లో లోపాలు ఉన్నాయని నమ్మబలికింది. కానీ 10 గంటల తర్వాత అభ్యర్థుల వారీగా వేసిన నామినేషన్లను ఒకటిగా చేసి సీరియల్ నెంబర్ ప్రాతిపదికన పత్రాలను పరిశీలించారు.
ఇందులో మాగంటి సునీత సీరియల్ నెంబర్ 23 కాగా మధ్యాహ్నం 3గంటల వరకు కూడా స్పష్టత రాలేదు. ఆమె వ్యక్తిగత విషయాలను నామినేషన్‌కు లింకు పెడుతూ తక్షణమే తిరస్కరించాలని ఎన్నికల అధికారులను కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేసినట్లుగా తెలిసింది. చివరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ అభ్యర్థి ఇచ్చిన వ్యక్తిగత, సివిల్ అంశాల వారీగా నామినేషన్ పత్రాలను పరిశీలించిన అధికారులు ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. దీంతో అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేసిన రగడ సద్దుమణిగింది. అయితే ఉదయం నుంచి జరిగిన నామినేషన్ల పర్వాన్ని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమాభరత్ మీడియాకు వెల్లడిస్తూ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసిన అభ్యంతరాలు పసలేనివని తెలిపారు.
వందలాదిగా వచ్చిన నామినేషన్లను పరిశీలన నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 2లోని షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి నుంచే కాంగ్రెస్ సోషల్ మీడియా బృందాలు.. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌పై విషప్రచారం చేశాయి. అయితే ఒక్కొక్కరుగా అభ్యర్థులు, అడ్వకేట్లు కార్యాలయానికి చేరుకుని నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు.
మొత్తం నామినేషన్ల పత్రాల పరిశీలన పూర్తి చేసినట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. పరిశీలన తర్వాత మొత్తం 81మంది అభ్యర్థులు వేసిన 150 నామినేషన్లలో 36 మంది అభ్యర్థులకు చెందిన 69 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన వాటిలో 45 మంది వేసిన 81 దరఖాస్తులను ఆమోదించినట్లుగా సాయంత్రం 7గంటలకు వెల్లడించిన వివరాల్లో తెలిసింది.