CPI Narayana | శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 21 : రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ విమర్శించారు. హైదరాబాద్ శంషాబాద్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో బహిరంగ సభ స్థానిక ఎంఎంఆర్ గార్డెన్లో నిర్వహించారు.
సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారని నారాయణ విమర్శించారు. అందులో భాగంగానే అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను రద్దు చేశారని వివరించారు. కార్మికుల హక్కులను కాలరాయడంతో కార్మికులు యాజమాన్యాలు చెప్పిన విధంగా ఉండాలనే చట్టాలు తీసుకువచ్చారని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అన్ని వర్గాలకు న్యాయం చేయకుండా కేవలం బీజేపీ నాయకులు పెట్టుబడిదారులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవడం కోసం కృషి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం సీపీఐ కృషి చేస్తూ అనేక పోరాటాలు చేస్తుందని వివరించారు.
దేశంలో ఇతర మతాలను కించపరిచే విధంగా వారి హక్కులను లేకుండా చేస్తున్న బీజేపీకి ప్రజలు తగ్గిన బుద్ధిచెప్పాలని నారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి సైతం తెలంగాణను అభివృద్ధి చేయకుండా పట్టుబడుల పేరుతో విదేశాలలో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. అనేక వనరులు ఉన్న తెలంగాణలో అభివృద్ధి చేయలేని రేవంత్రెడ్డి విదేశాలలో పర్యటించి తెలంగాణ ప్రజల సోమ్ముతో సోకులు చేస్తున్నారని విమర్శించారు. పేదలకు న్యాయం జరిగే విధంగా అభివృద్ధి పనులు చేయాలని సలహా ఇచ్చారు.