Piram Cheruvu | బండ్లగూడ, మార్చి 11 : గండిపేట మండలం పరిధిలోని పిరం చెరువు రోజురోజుకు ఆక్రమణలకు గురవుతుంది. ఆక్రమణదారులు రాత్రికి రాత్రి మట్టి కుప్పలు పోసి చదును చేస్తున్నారు. దీంతో పిరం చెరువు రోజురోజుకు కబ్జాకు గురువుతుంది. అంతేకాకుండా చెరువుతోపాటు ఎఫ్టీఎల్ పరిధిలో అనేక నిర్మాణాలు వెలుస్తున్నాయి. చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో వెలుస్తున్న నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది.
మండలం పరిధిలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే పిరం చెరువు విస్తీర్ణం 34 ఎకరాల 29 గుంటలు ఉండేది. కాగా చెరువుల పరిరక్షణ కోసం నాడు మిషన్ కాకతీయ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పూడికతీత పనులను చేపట్టారు. దీంతో పిరం చెరువులో భూగర్భ జలాలు పెరిగాయి. అయితే గతేడాది కాలంలో పిరం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటన్నింటిని పట్టించుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఆక్రమణదారుల నుంచి కాపాడి భవన నిర్మాణాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పిరం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలకు అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు గతంలో ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చి లంచాలు తీసుకొని ఏసీబీ అధికారులకు అడ్డుపడ్డారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అధికారులు పత్రాలన్నీ పరిశీలించడంతోపాటు ఎఫ్టిఎల్ పరిధిని గుర్తించి భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలా వద్ద అనేది నిర్ణయించాలని స్థానికులు కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు పార్కులు కాపాడుతామని హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో పిరం చెరువు పరిసర ప్రాంతాల్లో అనేక ఆక్రమణలు, నిర్మాణాలు జరుగుతున్న హైడ్రా తమకు ఏమీ పట్టనట్టుగా ఉంది. గతంలో ఒకసారి హైడ్రా కమిషనర్ రంగనాథన్ పిరం చెరువు పరిశీలించి వెళ్లారు. నాడు నిర్మాణాలు తక్కువగా ఉన్నప్పటికీ నేడు పదుల సంఖ్యలో నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇప్పటికైనా హైడ్రా లాంటి సంస్థలు పట్టించుకోని ఎఫ్టీఎల్తో పాటు పిరం చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పిరం చెరువును అక్రమ నిర్మాణాదారులతోపాటు ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని కాపాడాలని స్థానికుడు నరేష్ యాదవ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో నిర్మాణాలతోపాటు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదు అన్నారు. ఒకవేళ ఫిర్యాదు చేసిన రెండు రోజులు పని ఆపి మూడో రోజు నుంచి పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని పిరం చెరువులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.