సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ)/ అమీర్‌పేట: విద్యుత్ బిల్లుల వసూలుకు వెళ్లిన ఎర్రగడ్డ ట్రాన్స్‌కో కార్యాలయానికి చెందిన ఉద్యోగులపై వినియోగదారుడు భౌతికంగా దాడి చేశాడు. పెండింగ్‌లో ఉన్న రూ.6858 విద్యుత్ బిల్లును చెల్లించాలని అడిగిన ఉద్యోగుల పై దురుసుగా మాట్లాడటంతో పాటు భౌతికంగా దాడి చేయడంతో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీనగర్‌లోని మీసేవా సమీపంలో ఉన్న ఇంటి విద్యుత్ బిల్లు (యూఎస్సీ నంబరు-100124620) మొత్తం రూ.6858 చెల్లించాలని ఉద్యోగులు అడిగారు.
దీంతో ఇంటి యజమాని కొడుకు మేము కట్టం.. ఏం చేసుకుంటరో చేసుకోండి అనగానే, విద్యుత్ ఉద్యోగి మీటర్ పక్కన ఉన్న ఎంసీబీని బంద్ చేశాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన వెంకటస్వామి కొడుకు మురళీధర్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్‌ను కిందకు నెట్టేశాడు. అక్కడే ఉన్న మీటర్ రీడర్ సాయి గణేశ్‌పై దాడి చేసి, పిడిగుద్దులతో ముఖంపై, కడుపులో కొట్టాడు. లైన్ ఇన్స్పెక్టర్ను విడిపించేందుకు ప్రయత్నించినా తోసేసి దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో సాయి గణేశ్ కుడి కన్నుకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు మురళీధర్‌రావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ అధికారులు, సిబ్బందిపై దాడి చేయడం, విధులు నిర్వర్తించకుండా అడ్డగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ హెచ్చరించారు. గురువారం బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీనగర్‌లో జరిగిన ఘటనలో గాయపడిన విద్యుత్ శాఖ సిబ్బంది గణేశ్, శ్రీకాంత్, భాస్కర్లను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరంగా అవసరమైన సహాయం అందించాలని సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, గ్రీన్‌ల్యాండ్ డివిజినల్ ఇం జినీర్ సుధీర్లను ఆదేశించారు.హుటాహుటిన అతడిని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రికి తర లించారు. సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మురళీధర్‌రావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచ్చారు.