GHMC | జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.
డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వినయ్‌కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రాంనగర్ డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపిస్తూ కమిషనర్‌కు బీఆర్ఎస్ వినతి పత్రం అందజేశారు. వార్డుల విభజనను పునఃపరిశీలించాలని కోరారు.
జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజనకు ఆదేశాలిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నగరాన్ని 300 డివిజన్లుగా విభజించారు. ఆయా డివిజన్లకు హద్దులను ప్రకటిస్తూ కొన్నిరోజుల క్రితం ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది. గతంలోని డివిజన్లతో పోలిస్తే పాత జీహెచ్ఎంసీలోని డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది. దీంతో జీహెచ్ఎంసీలో పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు పోటెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల నుంచి విపక్షాలు, కాలనీ సంఘాలు, స్థానికులు ఇలా అన్ని వర్గాలు తీవ్రంగా సర్కారును తీరును ఎండగడుతున్నాయి. వార్డులోని ఓటర్ల సంఖ్య, భౌగోళిక స్వరూపం, సరిహద్దులను సమన్వయం చేసుకుని చేపట్టాల్సిన వార్డుల విభజనలో శాస్త్రీయత ఏ మాత్రం పాటించలేదంటూ భగ్గుమంటున్నాయి. 300 వార్డులను విభజించిన అధికారులు గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకువచ్చారని, ఇంత హడావుడిగా విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ పై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ వారం వ్యవధి గడువు తుది దశకు చేరింది. బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పునర్విభజన జరుగుతున్న తీరుపై విమర్శించారు. రెండు రోజుల్లో అభ్యంతరాల గడువు ముగియనున్నది. ఇప్పటి వరకు 1328 మంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రధానంగా అభ్యంతరాలను 25 వేల ఓటర్లకు మించకుండా వార్డులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వార్డుల పేర్లను మార్చాలని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్ పై ఈ నెల 16న జరగనున్న కౌన్సిల్లో బలంగా గళం విన్పించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.. వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తుండగా, ఇప్పటికే పలువురు మేయర్‌ను కలిసి పునర్విభజన అశాస్త్రీయంగా, ఒక వర్గానికి రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చేలా జరుగుతున్నదని ఆరోపించారు. ఈ క్రమంలోనే కౌన్సిల్ సమావేశంలో కూడా పునర్విభజనపై నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైన వేళ మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశం సర్వత్రా ఆసక్తి నెలకొంది.