సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మనీ లాండరింగ్ చేశారని పోలీసు, కోర్టు సిబ్బంది పేరుతో ఓ మహిళను భయాందోళనకు గురిచేయడమే కాకుండా ఐదు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన నిందితుడిని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పూణెలో అరెస్టు చేశారు. సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన కింగ్ శుక్ శుక్షా, కపిల్ కోమర్లు అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని ‘మీ పేరుతో డ్రగ్స్ పార్సిల్ వచ్చాయని, మీ బ్యాంక్ ఖాతా ద్వారా మనీలాండరింగ్ జరిగింది’ అంటూ పోలీసుల పేరుతో బెదిరింపులకు గురిచేయడమే కాకుండా లక్షల రూపాయలు దండుకుంటున్నారు.
గత నెల 2న నగరానికి చెందిన ఒక మహిళకు ఢిల్లీ హైకోర్టు నుంచి ఆమె పేరుతో ఉన్న సమస్యకు సంబంధించి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. అనంతరం ఆ కాల్ మరో వ్యక్తికి కనెక్ట్ అయ్యింది. ఫోన్లైన్లోకి వచ్చిన సదరు వ్యక్తి తాను ఢిల్లీలోని ఆర్సీపురం పోలీసు స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ గౌరవ్ శుక్లాగా పరిచయం చేసుకున్నాడు. మీ పేరుతో మోసపూరిత కార్యకలాపాలు జరగడమే కాకుండా మీ బ్యాంకు ఖాతా ద్వారా రూ.25లక్షల మనీ లాండరింగ్ లావాదేవీలు జరిగినట్లు మహిళకు చెప్పి భయాందోళనకు గురిచేశాడు. ఆ తరువాత డీసీపీ రాజేశ్ డియో అనే వ్యక్తికి ఫోన్ కనెక్ట్ చేశాడు.
డీసీపీగా పరిచయం చేసుకున్న రాజేశ్ అనే వ్యక్తి బాధిత మహిళను డిజిటల్ అరెస్ట్ పేరుతో స్కైప్, వాట్సాప్ ద్వారా 24గంటల పాటు ఐదు రోజులు పూర్తిగా కెమెరా నిఘాలో గృహ నిర్బంధంలో ఉంచాడు. బాధిత మహిళ తన వ్యక్తిగత సమాచారం, గుర్తింపు పత్రాలతో పాటు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 1.22కోట్లు నిందితులు సూచించిన వివిధ ఖాతాలకు బదిలీ చేసింది. అనంతరం మోసపోయినట్లు తెలుసుకున్న బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కపిల్ కోమర్ను పూణెలో అరెస్టు చేశారు.