సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇకనుంచి ఎన్నికల ప్రచారం మరింత జోరందుకోనున్నది. రాజధాని నగరంలో ప్రచారంపై ఆయా పార్టీల అధినాయకత్వం దృష్టి పెట్టింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నాయకుల ప్రచారాలు, రోడ్ షోలతో ఇక నగరంలో రాజకీయ సందడి మరింత పెరుగనున్నది. ఎన్నికల వేడి పెరుగుతుండటంతో ఆయా పార్టీల మధ్య వివాదాలకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని బందోబస్తును మరింత పెంచుతున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు నగరానికి చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ర్టాల ఎన్నికలలో భాగంగా నవంబర్ 7వ తేదీన చత్తీస్‌ఘడ్‌లో మొదటి ఫేజ్ ఎన్నికలు జరుగగా.. రెండో ఫేజ్ 17వ తేదీన జరుగుతున్నాయి. అలాగే, మధ్యప్రదేశ్‌లో కూడా 17వ తేదీన మొదటి దఫా ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఆయా రాష్ర్టాలలో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్ర బలగాలను తెలంగాణకు దఫ దఫాలుగా వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రచారాలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు అన్ని పార్టీల అగ్రనాయకులు నగరానికి వస్తున్నారు. దీనిపై ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. రోడ్‌షోలు, సభలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న పాతబస్తీలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
నగదు అక్రమ రవాణాపై పటిష్ట నిఘా : సీపీ
ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో తీసుకున్న చర్యలపై జిల్లా వ్యయ పర్యవేక్షకులు, ఎన్నికల అధికారులతో బుధవారం రాచకొండ సీపీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి తీసుకున్న భద్రతా చర్యలు, చెక్‌పోస్టులు, అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్ తరలింపు కేసులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర శాఖల అధికారులు తమ శాఖ తరఫున చేపట్టిన ఆయా కార్యక్రమాల గూర్చి వివరించారు. ఈ సందర్భంగా సీపీ చౌహాన్ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో అవసరమైన అన్నిచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నామన్నారు. తనిఖీలు నిర్వహించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమంగా తరలించే నగదు, మద్యం ఇతర వస్తువులను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో సీజ్ చేయిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర, ఐఏఎస్ అధికారి కొండిగ హనుమంత్, ఐపీఎస్ విపుల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చెక్‌పోస్టులను తనిఖీ చేసిన సీపీ డీఎస్ చౌహాన్
ఎన్నికల భద్రత, చెక్ పోస్టులలో సిబ్బంది పనితీరును రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పరిశీలించారు. పెద్ద అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తగూడ చెక్‌పోస్టును బుధవారం సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనాల తనిఖీలకు సంబంధించిన విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సీపీ వివరించారు. అవసరమైన చోట మరిన్ని చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామని, అక్రమ నగదు, మద్యాన్ని అడ్డుకోవడానికి పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామన్నారు.
విస్తృతంగా తనిఖీలు..రూ.3.58 కోట్ల నగదు సీజ్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో నగదు, అక్రమ మద్యం పట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా బుధవారం ఒక్కరోజు ఫ్లయింగ్ స్కాడ్ ద్వారా రూ.1,15,000 పట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ.3,58,47,450 నగదును సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు. దీంతో పాటు పోలీస్ అథారిటీ ద్వారా రూ49,50,20,372 నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. 727 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. 3150 నక్కాస్ ఆపరేషన్స్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద రెండు కేసులు నమోదైనట్టు వెల్లడించారు.