మణికొండ, సెప్టెంబర్ 30 : నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన తడిపొడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాల పనితీరు అద్భుతంగా ఉన్నదని రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలన డైరెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వట్టినాగులపల్లిలో ఏర్పాటు చేసిన వ్యర్థాలతో కంపోస్టు ఎరువుల తయారీ (డీఆర్సీసీ) కేంద్రాలను శనివారం ఆమె జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి సందర్శించారు. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీ కమిషనర్లు ఫల్గుణ్కుమార్, సురేందర్‌రెడ్డి వారికి సెగ్రిగేషన్ కేంద్రాల నిర్వహణను వివరించారు. తడి చెత్తతో సేంద్రీయ కంపోస్టు ఎరువుల తయారీ విధానం, అందుకోసం చేపడుతున్న చర్యలను తెలిపారు. అదేవిధంగా పొడి చెత్త, ఎలక్ట్రానిక్, ఇతర ప్లాస్టిక్ చెత్తతో చేపడుతున్న ఉత్పత్తులను చూపించారు. నగర శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో తడి,పొడి చెత్తతో ఇంతమంచి ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు ఆర్థిక వనరులను సాధిస్తుండటం అభినందనీయమని రాష్ట్ర పురపాలక శాఖ పరిపాలన డైరెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇలాంటి సెగ్రిగేషన్ కేంద్రాలను మరిన్ని మున్సిపాలిటీలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ కమిషనర్ ఎం.సురేందర్‌రెడ్డి, మణికొండ మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ్కుమార్, డీఈ నరసింహరాజు పాల్గొన్నారు.