దేశ రాజధాని ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డు వసంత్ విహార్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో ఢిల్లీ వీధులు గులాబీ మయమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ నూతన భవన ప్రారంభోత్సవానికి మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు జగన్, రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి ఉన్నారు.
– దుండిగల్, డిసెంబర్ 14
చర్లపల్లి, డిసెంబర్ 14 : బీఆర్ఎస్ బలోపేతంలో నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం, రాజ శ్యామల యాగం కార్యక్రమాలకు ఎమ్మెల్యే బేతి, నియోజకవర్గం కార్పొరేటర్లు, నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర వహించనున్నారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి అండగా ఉండాలని ఆయన సూచించారు. మైనార్టీ నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్, బీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్‌రెడ్డి, ఉప్పల్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎంకే బద్రుద్దీన్, అథర్ ఉల్లా, ఆరీఫ్ పాల్గొన్నారు.
బడంగ్‌పేట, డిసెంబర్ 14: ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. దేశంలో మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన దృష్ట్యా దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పు వస్తుందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి మేయర్ పాల్గొన్నారు.
ముషీరాబాద్, డిసెంబర్ 14: ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, టీ.సోమన్, ప్రభాకర్, రాకేశ్, శ్రీధర్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 14: దేశ రాజకీయాల్లో త్వరలోనే సరికొత్త మార్పులు చోటుచేసుకుంటాయని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో దీనికి బీజం పడిందని చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.
అబిడ్స్, డిసెంబర్14 : దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ అండ అవసరమని.. బీఆర్ఎస్తో ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా విస్తరించాలని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఆకాంక్షించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ఏర్పాటు చేసిన సందర్భంగా హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిప్తి దర్గాలో హోం మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డుచైర్మన్ మసియుల్లా ఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ ఉన్నారు.