ఖైరతాబాద్, మార్చి 6 : హైదరాబాద్ వేదికగా మేలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఆలిండియా డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం సంయక్తాధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు.
ఆడపిల్లలను ఓ శాస్తవ్రేత్త, వ్యాపారవేత్త, సంఘసంస్కర్త, విద్యావేత్తగా చూపించాల్సి ఉండగా, కమర్షియల్ మార్కెటింగ్ కోసం అందాల పోటీలను నిర్వహిస్తూ మరో సారి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు అలాంటి సాంకేతాలనిస్తున్నదని, అందాల పోటీలను విరమించుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఆలిండియా మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర కన్వీనర్ హేమలత, అటవీ శాఖ విశ్రాంత డిప్యూటీ సెక్రటరీ జి. కృష్ణవేణి, రచయిత, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అలూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.