పహాడీషరీఫ్, నవంబర్ 25 : పేదలకు విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్, కొత్తపేటలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానలను ప్రారంభించారు. అనంతరం 3వ వార్డులో రూ.12లక్షల వ్యయంతో డ్రైనేజీ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకు ముందు పహాడీషరీఫ్ బాబా షర్ఫుద్దీన్ దర్గాకు సందెల్ సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్ అర్బన్ ఏరియాలో భాగంగా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మొదట్లో జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ఏరియా మున్సిపాలిటీలను గుర్తించి 72 బస్తీ దవాఖానలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. కాగా మహేశ్వరం నియోజకవర్గంలో 12 బస్తీ దవాఖానలు మంజూరయ్యాయని చెప్పారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4 బస్తీ దవాఖానలు మంజూరు కాగా శ్రీరామకాలనీ, వాది ఏ సాలహీన్లో గతంలోనే ప్రారంభించామని, నేడు పహాడీషరీఫ్, కొత్తపేటలో ప్రారంభించామని తెలిపారు. షాహీన్‌నగర్, వాది ఏ ముస్తఫా ప్రాంతాలతో పాటు మరో 2 బస్తీ దవాఖానలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బస్తీ దవాఖానల ఏర్పాటుతో పేదలకు వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు.
అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం శుభపరిణామం అన్నారు. మనబడి – మనఊరు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ వసంత, కో-ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు నయీమ్, జాఫర్బామ్, జింకల రాధిక శ్రావణ్, అహ్మద్ కసాది, శంషోద్దీన్, షేక్ అఫ్జల్, శ్రావణ్‌కుమార్, మజర్ అలీ, దస్తగిర్, ఖదీర్, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, టీఆర్ఎస్ నాయకులు నాసర్ అవాల్గీ, ఖైసర్ బామ్, ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, యంజాల జనార్దన్, వాసుబాబు, నిమ్మల నరేందర్‌గౌడ్, రవి, యాస్మిన్ బేగం, మన్నన్, వైద్య అధికారులు వెంకటేశ్వరరావు, వినోద్ కుమార్, శారద, ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్ కె. శ్రీనివాస్, మున్సిపాలిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.