Ambedkar statue | సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) ;సాగర తీరంలో ఆవిష్కృతమైన 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు ఆదివారం సందర్శకులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. హుస్సేన్‌సాగర్ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిష్ఠించిన అంబేద్కర్ మహా ప్రతిమను వీక్షించి పులకించిపోయారు. సెల్ఫీలు తీసుకొని.. సంబరపడ్డారు. మహా విగ్రహాన్ని ఆవిష్కృతం చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నగరం నలుమూలల నుంచి సందర్శకులు తరలిరావడంతో ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, నెక్లెస్ రోడ్లన్నీ కిటకిటలాడాయి.
ఆర్థిక సమానత్వ సాధకుడు..
తెలంగాణ సమాజాన్ని ఆర్థిక సమానత్వంతో నడిపించాలనే తపన గల నాయకుడు, సాధకుడు సీఎం కేసీఆర్. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు సాటిలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కొందరి వాడు కాదని, తన జ్ఞానాన్ని భావితరాలకు అందించి, హక్కులను పంచిన తీరు ఆయన త్యాగాన్ని, పోరాటాన్ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. దేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకొని ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమంటే గొప్ప విషయమే.
–ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్, వీసీ, శాతావాహన వర్సిటీ
కొత్త పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి
నగరం నడిబొడ్డున 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటివరకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ పేరును కేవలం ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నాయి. కానీ మొదటి సారిగా అంబేద్కర్‌కు సరైన గౌరవం అందించిన పార్టీ బీఆర్ఎస్సే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని గుర్తించుకొని.. ఆ అభిమానంతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం. నూతనంగా నిర్మించిన సచివాలయానికి సైతం అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప విషయం. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.
– ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ లా, ఉస్మానియా యూనివర్సిటీ
ప్రణాళికాబద్ధంగా..
ఒక ప్రణాళికాబద్ధంగా దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘం. తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుల అభివృద్ధి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి అనేక గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం, ప్రతి జిల్లాలో ఎస్సీ స్టడీ సరిల్, ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వంటివి చరిత్రలో ఎన్నడూ చూడలేదు.
–తల్లమల్ల హస్సేన్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు
దేశానికి కేసీఆర్ దిశానిర్దేశం..
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో దేశానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇ క నుంచి దేశంలో పెనుమార్పులు రావడానికి ఆస్కారం ఉంది. అంబేద్కర్ ఆశించినట్లు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాల్సిన అవసరమున్నది. అంబేద్కర్ ఆలోచన అమలులోకి రావాలంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి సీఎం కేసీఆర్ పోరాటానికి దిగాల్సిందే. ఆయన పోరాట పటిమ దేశానికి దిశా నిర్దేశనం చేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాల్సిందే.
–డాక్టర్ జి.అంబేద్కర్, దిశ ఆర్గనైజేషన్
ప్రజాస్వామ్య పరిరక్షకుడు..
బాబాసాహెబ్ దేశానికి రాజ్యాంగాన్ని అందిస్తే.. రాజ్యాంగ హక్కులను అమలు చేసి, ఆ ఫలాలను అన్ని వర్గాలకు అందజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాస్వామ్య పరిరక్షణకు హైదరాబాద్‌లోనే బలమైన బీజం పడింది. దేశంలో ఎకడా లేని విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్‌ను సమున్నతంగా గౌరవించున్న ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కింది. ఆయనకు కృతజ్ఞతలు.
–మందాల భాస్కర్, తెలంగాణ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్