Harish Rao | తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని.. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనారిటీ విభాగం సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుసేన్, సలీం, బీఆర్ఎస్ మైనారిటీ నేత సొహయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేయాలని సూచించారు.
కేసీఆర్ ఉన్నప్పుడు మైనార్టీలు సంతోషంగా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మైనార్టీ విద్యాసంస్థలు, అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్య అందించారని అన్నారు. అంతేకాదు దేశంలో మొదటిసారి ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనమిచ్చి గౌరవించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రంజాన్ తోఫా ఇచ్చి ముస్లిం సోదరుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్డని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో చెప్పింది ఏంటి.. మైనార్టీ సబ్ ప్లాన్ ఇస్తాం. నాలుగు వేల కోట్లు మైనార్టీలకు బడ్జెట్ కేటాయిస్తాం. ఇమామ్, మౌజన్లకు రూ. 5,000 నుండి రూ. 12 వేలకు పెంచుతామని అన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కేసిఆర్ రూ. 20 లక్షలు ఇస్తే, మేము రూ. 25 లక్షలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని చెప్పారు. ఇందులో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకువచ్చి వారితో మాట ఇప్పించాడని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఎన్నికల తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పత్తా లేరని అన్నారు. ఒక లక్ష 12 వేల మంది పేద మైనార్టీ ఆడబిడ్డలకు షాదీ ముబారక్ కేసీఆర్ అందించాడని తెలిపారు. కాంగ్రెస్ తులం బంగారం ఇస్తామని మోసం చేసి షాదీ ముబారక్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేసినంత దేశంలో మరి ఏ నాయకుడు చేయలేదని చెప్పారు. మైనార్టీలకు రూ. 4 వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కానీ రూ. 1000 కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు. రంజాన్ తోఫా బంద్ అయింది. కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ అయింది. ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ అయింది అని తెలిపారు.