మెహిదీపట్నం, డిసెంబర్ 4: కాంగ్రెస్, బీజేపీలు దోస్తులని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నది బీఆర్ఎస్ ఒక్కటేనని, బీఆర్ఎస్ను రాష్ట్రం నుంచి దూరం చేయాలనుకోవడం కల్ల అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం సీఎంగా కేసీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బుధవారం రాత్రి మాసబ్ ట్యాంక్ ఖాజా మెన్షన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ముఖీత్ చంద్ దీక్షా దివస్‌లో భాగంగా ముషాయిరా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సలీం, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలను మోసపూరిత మాటలతో మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. నగరంలో మూసీ నది పరీవాహకంలో ఇండ్లు కోల్పోతున్న పేదలకు తాము అండగా ఉంటామని చెప్పారు. ప్రజలు తిరగబడి కాంగ్రెస్‌ను ఖతం పట్టించడం ఖాయం అని, ఆ రోజు దగ్గరలోనే ఉందన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ విమర్శిస్తున్న వారిని ,ఇక్కడ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఆదరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం ఎంత పోరాడామో.. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల కోసం తాము ఎల్లప్పుడూ పోరాడుతామని స్పష్టం చేశారు. మైనార్టీ నాయకులు కన్వీనర్ ముఖీత్ చంద్ పాల్గొన్నారు.