Congress Govt | సిటీబ్యూరో: కాంగ్రెస్ సర్కార్ తీరుతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే పలు కాలనీల వాసులు మంచినీరు, కరెంటు కోతలు, కాలుష్యంతో అల్లాడుతున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో పక్కా ప్రణాళికతో నగర ప్రజలకు సీజన్‌తో సంబంధం లేకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ ఏలుబడిలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కరెంటు కోతలపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కారుపై మీమ్స్‌తో సెటైర్లు వేస్తున్నారు. ఎండాకాలంలో నీటి కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్ కాలనీ వాసులు రెండు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్లో పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఇలా గ్రేటర్ పరిధిలో ప్రజలు ప్రభుత్వంపై నిరసన గళం ఎత్తుతున్నారు.
హామీలొద్దు..మంచినీళ్లివ్వండి
బండ్లగూడ: బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. పద్మశ్రీ హిల్స్ కాలనీవాసులు రెండు రోజులుగా రిలే నిరాహార దీక్షకు దిగారు. ఆదివారం బీజాపూర్ ప్రధాన రహదారిపై బిందెలతో మహిళలు ధర్నా నిర్వహించారు. తమ కాలనీకి నీరు సరఫరా చేసేంత వరకు ధర్నాను విరమించేది లేదన్నారు. కాలనీలో సుమారు 1200 కుటుంబాలు నీటి వసతి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో పాటు అనేకమంది ప్రజా ప్రతినిధులు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
హామీలు వద్దు..
పద్మశ్రీ హిల్స్ కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో బీజాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో కాంగ్రెస్ నాయకులు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన కాలనీవాసులు ‘హామీలు మాకు వద్దు సార్’ అంటూ సమాధానం ఇవ్వడంతో పాటు వెళ్లిపోవాలని సూచించారు. కాగా , జ్ఞానేశ్వర్ అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం అవసరమైన నిధులను కేటాయించేందుకు మంత్రులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.
వాటర్ ట్యాంకును బుక్ చేస్తే క్యాన్ నంబర్ అడుగుతున్నారు
పద్మశ్రీ హిల్స్ కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా నీరు సరఫరా లేకపోవడం బాధాకరం. ట్యాంకర్ కోసం ఆన్లైన్లో బుక్ చేస్తే వారు క్యాన్ నంబర్ అడుగుతున్నారు. నల్లా కనెక్షన్ లేనప్పుడు క్యాబ్ నంబర్ ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే.. క్యాన్ నంబర్ ఉన్నవారికి నీటి సరఫరా చేస్తామంటున్నారు.
– కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి.
ఇబ్బందులు పడుతున్నాం
పద్మశ్రీ హిల్స్‌కాలనీకి నల్ల కనెక్షన్లు లేకపోవడంతో పాటు మంచినీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులుపడుతున్నాం. అనేకసార్లు ప్రజా ప్రతినిధులు, జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది.
– స్థానికురాలు గాయత్రి
ప్రాణాలు పోతున్నా..పట్టించుకోరా..
దుండిగల్: బాచుపల్లిలో ఆదివారం పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా నిజాంపేట కార్పొరేషన్ ప్రజలు ర్యాలీ నిర్వహించారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఫ్లకార్డులుతో ర్యాలీ తీశారు. ఐడీఏ బొల్లారం తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమలు రాత్రి పొద్దుపోయిన తర్వాత, తెల్లవారుజామున హానికారకమైన విష వాయువులను గాలిలోకి విడుదల చేస్తుండడంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు.
Hyd
పీసీబీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది
పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడంలో పీసీబీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియడం లేదు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు ఎందుకు కొమ్ముకాస్తున్నారు. ఇప్పటికే కాలుష్యంతో బాచుపల్లి పరిధిలో కొందరు చనిపోతున్నారు. పీసీబీని ఎందుకు పట్టించుకోవడం లేదు.
– రవి, బాచుపల్లి
ఆందోళన ఉధృతం చేస్తాం
పీసీబీ అధికారులు, ప్రభుత్వం గాని పట్టించుకోవడం లేదు. వాయు కాలుష్యంతో ప్రజలు ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి కాలుష్యకారమైన పరిశ్రమలను మూసివేయాలి. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తాం.
-శ్రీలక్ష్మి నిజాంపేట